జిల్లాల్లో మరో 70 పారిశ్రామికవాడలు
స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం
ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలకు ప్రాధాన్యత
హైదరాబాద్, జనవరి 1 : జిల్లాల్లో ఉద్యోగావకాశాలను పెంపొందించడంతోపాటు హైదరాబాద్ నగరానికి వలసలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా కొత్త పారిశ్రామికవాడలకు శ్రీకారం చుడుతున్నది. ఇందులో భాగంగా కొత్తగా 70 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసీ) జిల్లాలవారీగా పారిశ్రామికవాడల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రధానంగా హైదరాబాద్, దానిచుట్టుపక్క జిల్లాలైన మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమవుతున్నది. దీంతో జిల్లాలనుంచి హైదరాబాద్ శివార్లకు వలసలు ఎక్కువవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలవారీగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికంగా లభించే ఆహార ఉత్పత్తులు, ముడిసరుకుల ఆధారంగా అక్కడే యూనిట్లు ఏర్పాటుచేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నది దీని ముఖ్యోద్దేశం.
స్థలాల గుర్తింపునకు కలెక్టర్లకు లేఖలు..
జిల్లాలవారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోనే వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వభూమి లభించని పక్షంలో పట్టాభూములను సేకరించాలని భావిస్తున్నట్లు, ఇందులో వ్యవసాయయోగ్యంగాలేని భూములకు ప్రాధాన్యతనిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే జిల్లాలవారీగా భూముల గుర్తింపునకు కలెక్టర్లకు లేఖలు రాశామన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాలనుంచి జిల్లాలకు రోడ్డు కనెక్టివిటీ, పలుచోట్ల రైలు కనెక్టివిటీ కూడా ఉందని, రవాణా సదుపాయాలు, స్థానిక ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకొని ఆయా పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. అన్ని జిల్లాలనుంచి హైదరాబాద్కు మంచి రవాణా సౌకర్యం ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంవల్ల ఎక్కడికైనా సునాయాసంగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు.
ఏ జిల్లాలో ఎన్ని..
జగిత్యాల-1, ఖమ్మం-1, మహబూబాబాద్-1, మహబూబ్నగర్-3, మెదక్-7, మేడ్చల్-మల్కాజ్గిరి-4, నాగర్కర్నూల్-1, నల్గొండ-3, నారాయణపేట్-1, నిర్మల్-1, రాజన్న సిరిసిల్ల- 4, రంగారెడ్డి-19, సంగారెడ్డి-6, సిద్ధిపేట-6, వికారాబాద్-5, వనపర్తి-2, వరంగల్-1, యాదాద్రి-భువనగిరి- 4, మొత్తం-70
రాష్ట్ర ఏర్పాటు అనంతరం పారిశ్రామికరంగం విస్తరణ ఇలా..