న్యూఢిల్లీ : ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయించడం లేదని కేంద్రం తెలిపింది. ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌కుమార్ లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం అందించారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కొవిడ్ వ్యాక్సిన్ల డిమాండ్‌ను కొవిన్ పోర్టల్‌లో సమీకరించామని పేర్కొన్నారు.
ప్రైవేటు ఆసుప్రతులు టీకాల లభ్యతకు అనుగుణంగా కోవిన్ పోర్టల్‌లో వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను తయారు చేసి, ప్రచురించాయని పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ నాటికి మొత్తం 3.56 కోట్ల మోతాదులను సేకరించాయని, అవి సేకరించిన టీకాలను తిరిగి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించరని స్పష్టం చేశారు. జనవరి నుంచి 75, 25 ఫార్ములా కింద ప్రభుత్వ కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు విడుదల చేసిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ప్రైవేటు ఆసుపత్రులు నెలవారీ కోటాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే.. వినియోగించని టీకా కోటాను రాష్ట్రాల్లోని ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయించాలని సూచిస్తున్నారా? అని ఓ ఎంపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. మే ఒకటి నుంచి జూన్ 20 వరకు టీకా తయారీదారులు, కొత్త కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు సరళీకృత ధర, వేగవంతమైన జాతీయ కొవిడ్-19 టీకా వ్యూహం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.