మేడ్చల్, సెప్టెంబర్20(నమస్తే తెలంగాణ): ‘22ఏ నిషేధిత జాబితాలో లేకపోతే.. ఎన్వోసీలైనా ఇవ్వండి.. లేదా రిజిస్ట్రేషన్లనైనా చేయండి’.. అంటూ నిషేధిత జాబితాలో ఉన్న బాధితులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన క్రమంలో క్రయ విక్రయాలకు సంకేళ్లు పడిన నేపథ్యంలో ఇలా ఇంకేనాళ్లకు తమ ఆస్తులకు సంకెళ్లు తొలగిస్తారని బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలలోని వివిధ ప్రాంతాలలో 19, 200 ప్రజల ఆస్తులు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే నిషేధిత జాబితాలో ఉన్న ప్రజల ఆస్తులకు గతంలో నిషేధిత జాబితాలో లేనట్లు రెవెన్యూ అధికారులు ఎన్వోసీలు జారీ చేసేవారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఎన్వోసీలు ఇవ్వకుండా నిషేధిత జాబితాలో ఉన్న ప్రజల ఆస్తులను తొలగించేందుకు రిజిస్ట్రేషన్ ప్రధానశాఖకు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు నివేదికలను ఆన్లైన్లో పంపుతున్నారు. అయితే సమస్య అంతా ఇక్కడే వచ్చింది.
ఎన్వోసీలు కావాలని వచ్చిన బాధితులతో రెవెన్యూ అధికారులు ఎన్వోసీలు ఇప్పుడు ఇవ్వడం లేదని నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతున్న క్రమంలో మీకు రిజిస్ట్రేషన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సమాధానం చెప్పి పంపుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఇందుకు భిన్నంగా బాధితులకు పరిస్థితి కనిపిస్తున్నది. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇంకా నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ఎలాంటి సమాచారం లేదని రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదని తిప్పి పంపుతున్నారు. దీంతో బాధితులు రెవెన్యూ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో లేనట్లు ఎన్వోసీలైనా ఇవ్వండి లేదా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు.
కాగా గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అసలైన నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్లను చేసిన సబ్ రిజిస్ట్రార్లను రెవెన్యూశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కావాలనే సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల సబ్రిజిస్ట్రార్లతో పాటు, ఉద్యోగులు బాధితులకు సహకరించడం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రైవేట్ ఆస్తుల యజమానులు మరింత ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్వోసీలు తీసుకువస్తేనే రుణాలు ఇస్తామని వివిధ బ్యాంకుల అధికారులు స్పష్టం చేస్తున్న క్రమంలో బాధితులకు తోచడం లేదు. ప్రస్తుత పరిస్థితులలో రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీలు ఇవ్వకుండా నిషేధిత జాబితాలో లేని ప్రైవేట్ ఆస్తులను తొలగిస్తున్నట్లు పేర్కొంటున్నారు బ్యాంకు అధికారులు. రుణాలు ఇచ్చేందుకు మాత్రం తప్పని సరిగా ఎన్వోసీలు ఇవ్వాల్సిందే అంటూ రుణాలను ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో యూల్ఎసీ భూములలో నిర్మించుకున్న ఇంటి నిర్మాణాలకు రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో దళారులు యూఎల్సీ దందాకు తెర లేపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో సమారు వందల కాలనీలు యూఎల్సీ భూములలో నిర్మించి ఉన్నట్లు రెవెన్యూ పరిశీలనలో తేలింది.
దీంతో వీటిని రెగ్యులరైజ్ చేయనుందన దళారులు ఇప్పటికే రంగంలోకి దిగి యూఎల్సీ భూములలో ఇండ్లు నిర్మించి ఉన్న యజమానులను కలుస్తూ యూఎల్సీ నుంచి తీసివేయించి రెగ్యూలరైజ్ చేసేందుకు డబ్బులు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. 22ఏ నిషేధిత జాబితాలో ఇప్పటికే దళారులు పంట పండుతుండగా యూఎల్సీ భూములలో నిర్మించుకున్న ఇండ్ల రెగ్యులరైజ్ చేయించేలా చూస్తామని బాధితుల నుంచి డబ్బులు దండుకునేందుకు దళారులు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.