అంచనాల్లేకుండా బరిలోకి దిగిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అద్భుతం చేశాడు. కాలి గాయం ఇబ్బందిపెడుతున్నా.. మొక్కవోని దీక్షతో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో అత్యధిక (21) గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఆటగాడిగా.. ఫెదరర్, జొకోవిచ్‌ను వెనక్కి నెట్టి శిఖరాగ్రానికి చేరాడు! తొలి రెండు సెట్లు కోల్పోయాక పడిలేచిన కెరటంలా విజృంభించిన నాదల్.. చివరి మూడు సెట్లలో మెద్వెదెవ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. పదునైన సర్వీస్‌లతో పాటు.. చురుకైన నెట్‌గేమ్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిన రాఫెల్.. విజయం అనంతరం తన కెరీర్లో ఇది భావోద్వేగపూరిత పోరని గద్గద స్వరంతో పేర్కొన్నాడు.
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్‌లో నయా చరిత్ర లిఖిస్తూ.. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. గాయంతో బాధపడుతూనే అద్వితీయ ప్రదర్శన కనబర్చిన ఈ పాతకాపు.. సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్ (20 టైటిళ్లు)ను వెనక్కి నెడుతూ అగ్రస్థానానికి చేరాడు. సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ నాదల్ 2-6, 6-7 (5/7), 6-4, 6-4, 7-5తో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ పోరులో.. 35 ఏండ్ల నాదల్ తొలి రెండు సెట్లు కోల్పోయిన అనంతరం తిరిగి పుంజుకొని సత్తాచాటాడు. అందరికంటే ముందే 20 గ్రాండ్‌స్లామ్స్ చేజిక్కించుకున్న స్విస్ దిగ్గజం ఫెదరర్ గాయం కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం కాగా.. కరోనా నిబంధనల ఉల్లంఘన వల్ల జొకోవిచ్ (సెర్బియా) సీజన్ ఆరంభ టోర్నీ నుంచి వెనుదిరుగాల్సి వచ్చింది. సీనియర్ల గైర్హాజరీలో వరుస విజయాలతో దూసుకెళ్లిన నాదల్కు ఫైనల్లో అసలు సిసలు పోటీ ఎదురైంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన సుదీర్ఘ పోరులో ఒక దశలో నాదల్ గట్టెక్కడం కష్టమే అనిపించినా.. పోరాటాన్నే ఊపిరిగా చేసుకొని ఇన్నాళ్లుగా తిరుగు లేకుండా సాగుతున్న నాదల్.. అదే స్ఫూర్తిని మెల్‌బోర్న్‌లోనూ కొనసాగిస్తూ మెద్వెదెవ్‌ను మట్టికరిపించాడు. మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడుతుంటే.. ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది అభిమానులతో పాటు.. టీవీలకు అతుక్కుపోయిన లక్షలాది మంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు! మహిళల డబుల్స్‌లో టాప్‌ర్యాంక్ జోడీ క్రెజికోవా-సినికోవా టైటిల్ చేజిక్కించుకుంది.
ఆహా.. ఏమా పోరాటం!
నవశకంలో తనను గ్రేటెస్ట్ ప్లేయర్ అని ఎందుకంటారో నాదల్ మరోసారి రుజువు చేశాడు. మట్టికోటలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న నాదల్ మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌లతో పోల్చుకుంటే.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2009లో ఇక్కడ ఏకైక టైటిల్ సాధించిన నాదల్.. రెండు నెలల క్రితం మెల్బోర్న్లో విజయం సాధించడం గురించి కనీసం ఆలోచించనైనా లేదు. పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే.. మ్యాచ్ మధ్య విరామాల్లో వైద్యం చేయించుకుంటూ ముందుకు సాగిన నాదల్.. ఆదివారం తుదిపోరులో తనలోని పోరాట యోధుడిని తట్టిలేపాడు. తొలి సెట్ కోల్పోయిన నాదల్.. 84 నిమిషాల పాటు సాగిన రెండో సెట్లో టైబ్రేక్‌లో వెనుకబడిపోయాడు. ఇంకేముంది మరో సెట్ ఓడితే.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కల చెదిరే తరుణంలో శక్తినంతా కూడదీసుకొని విజృంభించాడు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఉత్కంఠ భరిత ఫైనల్లో నాదల్ మూడు ఏస్‌లకే పరిమితమైతే.. మెద్వెదెవ్ 23 ఏస్‌లతో చెలరేగాడు. చెరో ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసినా.. గతేడాది యూఎస్ ఓపెన్ నెగ్గిన మెద్వెదెవ్పై నాదల్ ఆఖర్లో పైచేయి సాధించి ‘బిగ్ బుల్’ అనిపించుకున్నాడు.
1
పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ (21) గెలిచిన ఆటగాడిగా రాఫెల్ నాదల్ చరిత్రకెక్కాడు. రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్ చెరో 20 గ్రాండ్‌స్లామ్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.
2
ఓపెన్ ఎరా (1970
తర్వాత)లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను రెండేసి సార్లు గెలుచుకున్న రెండో ఆటగాడిగా నాదల్ చరిత్రకెక్కాడు. జొకోవిచ్ ముందున్నాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నాదల్ నిలిచాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సుదీర్ఘంగా (5 గంటలా 24 నిమిషాల పాటు) సాగిన రెండో ఫైనల్ ఇది. 2012లో నాదల్, జొకోవిచ్ మధ్య ఫైనల్ ఫైట్ 5 గం॥ 53 ని.ల పాటు జరిగింది.
నా కెరీర్లో ఇదో భావోద్వేగభరిత పోరు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. రెండు నెలల క్రితం అసలు దీని గురించి కూడా ఆలోచించలేదు. కాలి గాయం నుంచి కోలుకొని తిరిగి మైదానంలో అడుగు పెడతానా లేదా అనుకునే వాడిని. అలాంటిది ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా ఓపెన్ చేజిక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
హైలైట్స్
2005 నుంచి ఇప్పటి వరకు 68 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు జరుగగా.. అందులో నాదల్, ఫెదరర్, జొకోవిచ్ కలిసి 57 టైటిల్స్ గెలుచుకున్నారు.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఇప్పటివరకు 29 ఫైనల్స్ ఆడిన నాదల్.. అందులో 21 సార్లు విజేతగా నిలువగా.. సహచరులు ఫెదరర్, జొకోవిచ్ 31 ఫైనల్స్ ఆడి 20 టైటిల్స్ ఖాతాలో వేసుకున్నారు.
1965 తర్వాత తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు.
నాదల్ ప్రస్థానం..
తొలి రౌండ్లో 6-1, 6-4, 6-2తో మార్కస్ గిరోన్ (అమెరికా)పై గెలుపు
రెండో రౌండ్లో 6-2, 6-3, 6-4తో యానిక్ హాఫ్మన్ (జర్మనీ)పై విజయం
మూడో రౌండ్లో 6-3, 6-2, 3-6, 6-1పై కరెన్ కచనోవ్ (రష్యా)పై జయభేరి
ప్రిక్వార్టర్స్‌లో 7-6 (16/14), 6-2, 6-2తో అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపు
క్వార్టర్ ఫైనల్లో 6-3, 6-4, 4-6, 3-6, 6-3తో డెనిస్ షపలోవ్ (కెనడా)పై విజయం
సెమీఫైనల్లో 6-3, 6-2, 3-6, 6-3తో బెర్టిని (ఇటలీ)పై జయభేరి
ఫైనల్లో 2-6, 6-7 (5/7), 6-4, 6-4, 7-5తో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపు