విదేశాల్లో చదువుకోవాలనుకునేవారి కలకు కరోనా మహమ్మారి కంటకంగా మారింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటం, వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే విదేశీ చదువులకు ద్వారాలు తెరుచుకున్నాయి. క్రమంగా ఊపందుకున్నాయి. ఈ ఏడాది ‘స్ప్రింగ్ సీజన్’ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కన్సల్టెన్సీల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల యూనివర్సిటీల నియమ నిబంధనలు తెలుసుకుందాం..
దేశం నుంచి విద్యాభ్యాసం కోసం విదేశాలకు వలసలు పెరుగుతున్నాయి. ఇందుకు వారిలో ఉన్న ఆసక్తి, అంతే స్థాయిలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు కారణంగా చెప్పవచ్చు. స్థానికంగా ఉన్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకోకుండా ఆయా దేశాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఒక్క అమెరికాలోనే 5వేలు, చిన్న దేశమైన ఐర్లాండ్‌లో 15 వందలు, ద్వీపదేశమైన న్యూజిలాండ్‌లో 2 వేలు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో వెయ్యి చొప్పున ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. దీంతో అక్కడి విశ్వవిద్యాలయాలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. వీటిని భర్తీ చేసుకోడానికి విద్యాసంస్థలు ప్రయత్నిస్తుండగా, విదేశాల్లో చదవాలన్న మోజుతో మనవాళ్లు క్యూకడుతున్నారు. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు గాను పలు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు స్కాలర్షిప్ టెస్ట్, వీసా ప్రాసెసింగ్, జీఆర్ఈ, టోఫెల్లతో సంబంధం లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఇటలీ
ఇటలీలోని 45 విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా టాప్ 1000 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
యూనివర్సిటీల్లో చదివేందుకు కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి.
ఇటలీలోని యూనివర్సిటీల్లో తక్కువ ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నారు. సంవత్సరానికి కేవలం 500 యూరోలు మాత్రమే వసూలు చేస్తున్నారు.
ఇక్కడ చదివేందుకు ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, టోఫెల్ తదితర స్కోర్ అవసరంలేదు.
పోలాండ్
ఉన్నత విద్య చదివేందుకు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 2వేల యూరోలు మాత్రమే.
15 ఏండ్లు దాటిని వారిని మాత్రమే విదేశీ చదువులకు అనుమతిస్తారు.
వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకోవచ్చు.
ఫ్రాన్స్
15 ఏండ్లు నిండిన వారిని మాత్రమే అనుమతిస్తారు.
కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ అవసరంలేదు.
ఇక్కడున్న 58 యూనివర్సిటీలు అంతర్జాతీయంగా టాప్ వెయ్యి యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయి.
రెండేండ్ల కాల వ్యవధి గల పోస్ట్ స్టడీ వీసాను మంజూరుచేస్తారు. దీంతో అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు.
వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఇస్తారు.
జర్మనీ
కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. కనీసం 6.5 స్కోర్ సాధించి ఉండాలి.
జర్మన్ లాంగ్వేజ్ లెవల్స్ ఏ1, ఏ2లలో పరిజ్ఞానం సంపాదించి ఉండాలి.
500కు పైగా ఇంగ్లిష్ మీడియం కోర్సులు, ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడి యూనివర్సిటీల్లో 55 వర్సిటీలు అంతర్జాతీయంగా టాప్ వెయ్యి యూనివర్సిటీల్లో చోటు సంపాదించాయి.
హంగేరి
యూరప్ ఖండానికి గుండెకాయ వంటిది. యూరోపియన్ నగరాలకు ఇక్కడి నుంచి సులభంగా రాకపోకలు సాగించవచ్చు.
ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
ఇక్కడ చదివేందుకు ఐఈఎల్టీఎస్, టోఫెల్ స్కోర్ అవసరం లేదు.
ట్యూషన్ ఫీజులు తక్కువగానే ఉంటాయి. జీవన వ్యయం కూడా తక్కువే.
నెలకు 500-600 యూరోలతో గడపవచ్చు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డార్మెటరీల్లో నెలకు 210 యూరోల వరకు తీసుకుంటున్నారు.
లిథువేనియా
ట్యూషన్ ఫీజులు తక్కువగానే ఉంటాయి. ఇక్కడి పౌరులు సైతం కొంత మొత్తాన్ని సమకూరుస్తుంటారు.
రిసెర్చ్, లిటరేచర్, కంప్యూటింగ్, టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రిసెర్చ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు పొందేందుకు ఐఈఎల్టీఎస్, టోఫెల్ నుంచి మినహాయింపు ఇస్తున్నారు.
లిథువేనియాలో అత్యధికులు విద్యావంతులే. పైగా కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. కాబట్టి భాషాపరమైన సమస్యలు ఉత్పన్నం కావు.
విద్యార్థులకు మార్కులు కాకుండా క్రెడిట్ల రూపంలో పట్టాలను జారీ చేస్తున్నారు.
విద్యార్థులు కోర్సును అభ్యసిస్తున్న సమయంలో ఇంటర్న్‌షిప్ చేయాలి. కోర్సుల వారీగా ఇంటర్న్‌షిప్‌ను పటిష్టంగా అమలుచేస్తున్నారు.
చెక్ రిపబ్లిక్
చెక్ రిపబ్లిక్ విద్యావిధానం అత్యంత పురాతనమైనది. 1348లోనే చార్ల్స్ యూనివర్సిటీని స్థాపించారు. ప్రతి సంవత్సరం 37వేల మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
చదువులన్నీ ఇంగ్లిష్ మీడియంలోనే కొనసాగుతున్నాయి.
మన విద్యావిధానంలాగే బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలను అందిస్తున్నారు. 3-4 ఏండ్ల డిగ్రీ, రెండేండ్ల మాస్టర్ పోగ్రామ్లు నిర్వహిస్తున్నారు.
సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్‌లో ఉన్నత విద్య, రిసెర్చ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
విద్యార్థులు చదువుకునేటప్పుడు స్టడీ విజిట్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. నెలకు 350-750 యూరోలు ఖర్చవుతాయి.
నార్వే
వొకేషనల్ కోర్సుల నుంచి మొదలుకుంటే డాక్టోరల్ వరకు భిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
తరగతి బోధన తర్వాత విద్యార్థులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ట్యూషన్లు చెబుతారు.
ప్రతి సంవత్సరం 12వేల అంతర్జాతీయ విద్యార్థులు నార్వేలో ప్రవేశాలు పొందుతున్నారు.
రిసెర్చ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికి 18.2 బిలియన్ల నార్వేజియన్ క్రోన్లను రిసెర్చ్‌కు ఖర్చుచేస్తున్నారు.
లాత్వియా
లాత్వియాలో 60 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటే 50 సైన్స్‌కు సంబంధించినవే ఉన్నాయి.
ట్యూషన్ ఫీజులుగా సంవత్సరానికి 1700 యూరోలు ఉండగా, అంతర్జాతీయ విద్యార్థులకు 3700 యూరోలు తీసుకుంటున్నారు.
ఏడాదికి ఆటమ్, స్ప్రింగ్ కాలాల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్, జూన్ మాసాల్లో మాత్రమే అడ్మిషన్లు పొందవచ్చు.
మనలాగే సెమిస్టర్ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఒక్కో సెమిస్టర్ 20 వారాలు ఉంటుంది. పరీక్షలు 20 వారాల్లో నిర్వహిస్తారు.
లాత్వియన్, రష్యన్భాషలతో పాటు ఇంగ్లిష్, జర్మన్ భాషలు మాట్లాడతారు.
విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది
-హరికాంత్‌రెడ్డి, డైరెక్టర్ ఎడ్యు2టెక్
విదేశీ చదువుల కోసం క్యూ కట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రతి ఏటా మన రాష్ట్రం నుంచే 4 లక్షల విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. కరోనా కారణంగా ఇంకా కొన్ని దేశాల్లో అడ్మిషన్లు ప్రారంభం కాలేదు. త్వరలోనే ప్రారంభమవుతాయి.
జీవితంలో స్థిరపడాలన్న ఆకాంక్ష -శివాజీ, హైదరాబాద్
హైదరాబాద్‌లోని గురునానక్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశా. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలన్న ఆకాంక్షతో అమెరికా వెళుతున్నాను. లూయిస్ యూనివర్సిటీలో సీఎస్ఈలో చేరబోతున్నాను. ఉత్తమ చదువులు చదివి, ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు విదేశీ చదువులు దోహదపడతాయి.
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో 22 ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలతో పాటు 500కు పైగా విద్యాలయాలున్నాయి.
ఆస్ట్రేలియాలో యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు సెమిస్టర్‌కు కేవలం 18 యూరోలు మాత్రమే తీసుకుంటుండగా, నాన్ యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు ఏడాదికి 1450 యూరోలు చార్జీ చేస్తున్నారు.
అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్సిటీలు, ఆస్ట్రేలియన్ సంస్థలు ఎడ్యుకేషన్ గ్రాంట్స్, స్కాలర్‌షిప్స్‌ను అందిస్తూ ప్రొత్సహిస్తున్నాయి. నెలకు 475 నుంచి 679 యూరోల వరకు చెల్లిస్తున్నాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం నెలకు రూ.940 యూరోలను స్కాలర్‌షిప్స్‌గా అందిస్తుంది.
యూకే
యూకే చేరుకున్నాక కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్‌ను చూపించాలి. ప్రయాణానికి మూడు రోజుల ముందు పరీక్ష చేసుకుని ఉండాలి.
కనీసం 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి.
యూకేలో చదివేందుకు ఐఈఎల్టీఎస్ తప్పనిసరికాదు.
యూకేలో చదువులు పూర్తికాగానే విదేశీ విద్యార్థులకు రెండేండ్ల పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తున్నారు. దీంతో రెండేండ్లు ఉద్యోగం చేసుకోవచ్చు.
పార్ట్‌టైమ్ జాబ్స్ చేసే వారికి గంటకు 8-25 పౌండ్లు చెల్లిస్తారు.
స్టూడెంట్ ఫ్రెండ్లీ నేషన్ ఇది. ఇక్కడ విద్యార్థి అనుకూల విధానాలను అవలంబిస్తున్నారు.
కావాల్సిన డాక్యుమెంట్లు
ఆన్లైన్ దరఖాస్తు
ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
9, 10, 11 తరగతుల సర్టిఫికెట్లు (ప్రధానోపాధ్యాయులు/ ప్రిన్సిపాల్స్ సంతకం చేసిన జిరాక్స్ కాపీలు) ఇవి 1-15 వరకు అవసరం (ఒకేసారి చాలా కాలేజీలు/ స్కూళ్లకు దరఖాస్తు చేయాల్సి వస్తే).
పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీలు
టీచర్, కౌన్సిలర్ రికమండేషన్ (2-3 టీచర్స్ రికమండేషన్స్ తప్పనిసరి)
రెజ్యూమే
ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికెట్లు
స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటో
వ్యాసం (ఎస్సే)
శాట్ సబ్జెక్టు టెస్ట్, ఐఈఎల్టీఎస్ స్కోర్ జిరాక్స్ కాపీలు.