హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : సర్కార్ ఖజానా నుంచి నెలకు లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్ నేరుగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మీడియా-ప్రభుత్వానికి మధ్య వారధి పనిచేయాల్సిన సదరు అధికారి.. ఆ బాధ్యతలు మరచి అధికార పార్టీకి సలహాదారు మాదిరిగా కాంగ్రెస్ నేతలకు పొలిటికల్ క్లాసులు తీసుకోవడం సచివాలయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది.
ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హద్దులను చెరిపేసి, టీవీ చానళ్ల డిబేట్లలో ప్రతిపక్షాల గొంతు ఎలా నొకాలి? ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి? అనే అంశాలపై స్వయంగా శిక్షణ ఇవ్వగా, ఆయన నిర్వాకాన్ని అధికార పార్టీ ఎంపీయే బట్టబయలు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ నేతలకు పొలిటికల్ క్లాసులు ఇవ్వడమేందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆయన పౌర సంబంధాల అధికారి కాదని ‘కాంగ్రెస్ సంబంధాల అధికారి’గా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేయడంతో సీపీఆర్వో నిర్వాకం బట్టబయలైంది. పార్టీ మీడియా మీటింగ్‌లో సీపీఆర్వో మల్సూర్ పాల్గొన్న ఫొటోను పంచుకుంటూ.. ‘రాజకీయ అంశాలు, మీడియా డిబేట్లు, ప్రెస్మీట్లలో ప్రతిపక్షాలను ఎదురొనే వ్యూహాలపై టీజీ సీఎం సీపీఆర్వో డాక్టర్ మల్సూర్, హరిప్రసాద్‌తో చర్చించాం.. వారి సూచనలు ఎంతో విలువైనవి’ అంటూ ఎంపీ గొప్పగా రాసుకొచ్చారు. ప్రభుత్వ హోదాలో ఉంటూ ఓ పార్టీ రాజకీయ వ్యూహరచనలో పాలుపంచుకోవడం ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేయడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.