Sridhar Vembu : నేటి యువత 20 లలోనే పెళ్లిచేసుకొని పిల్లల్ని కనాలని జోహో సీఈవో (Zoho CEO) శ్రీధర్ వెంబు (Sridhar Vembu) సూచించారు. పెళ్లిళ్లపై అపోలో సీఎస్ఆర్ వైస్ ఛైర్పర్సన్, నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana) చేసిన పోస్ట్‌ను ఉద్దేశించి, ఆ పోస్టుకు కౌంటర్‌గా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తంచేశారు. యువత లేటు వయసులో కాకుండా సరైన సమయంలోనే పిల్లలను కనాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల ఉపాసన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆ సంభాషణను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి చేసుకుంటున్నారా..? అని తాను అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని తన పోస్టులో పేర్కొన్న ఆమె.. ‘మహిళలు కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారని దీనిని బట్టి అర్థమైంది. ఇది సరికొత్త భారత్’ అని రాసుకొచ్చారు.
ఈ పోస్టుపై శ్రీధర్ వెంబు సైతం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. యువత 20ల్లోనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని తాను సలహా ఇస్తుంటానని, వారు తమ సమాజం, పూర్వీకుల కోసం ఈ విధిని నిర్వర్తించాలని సూచించారు. ఇవన్నీ పాతకాలం మాటల్లా అనిపిస్తాయని, కానీ కాలక్రమంలో జరగాల్సింది అదేనని తాను భావిస్తున్నానని తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా శ్రీధర్ సలహాపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. యువత వివాహాలు వాయిదా వేయడం వెనక ఆర్థిక ఒత్తిడులు ప్రధాన కారణమని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఒక్కోతరం దృష్టిలో బాధ్యతకు ఒక్కో అర్థం ఉంటుందని, కొందరు కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తే.. ఇంకొందరు కెరీర్ ముఖ్యమనుకుంటారని, ఈ రెండు మార్గాలు సమాజానికి అర్థవంతమైనవేనని మరో నెటిజన్ పేర్కొన్నారు.