చెన్నై: తమిళనాడులో ఎట్టకేలకే టీవీకే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పడిన క్యాబినెట్లోని తొమ్మిది మంది మంత్రులలో ఎస్ కీర్తన ఒకరు. (S Keerthana) ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం విజయ్, ఇతర మంత్రులతో పాటు ఆమె కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం పాలనలో ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ‘ఇది నమ్మశక్యం కానిది, ఎందుకంటే మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి క్యాబినెట్ మంత్రి ఉండరు. మాకు ఎవరూ ఇంతటి అవకాశం ఇవ్వరు. మేం ప్రభుత్వాన్ని ఎంత బాగా నడపగలమో ప్రపంచానికి చూపించబోతున్నాం’ అని మీడియాతో ఆమె అన్నారు.
కాగా, భారత దేశానికి ‘బాణసంచా రాజధాని’గా పిలిచే తమిళనాడులోని శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా 29 ఏళ్ల కీర్తన ఎన్నికయ్యారు. 11,697 ఓట్ల తేడాతో ఆ స్థానంలో ఆమె గెలిచారు. శివకాశి నియోజకవర్గంలో ఇప్పటి వరకు విజయం సాధించిన ఏకైక మహిళా ఎమ్మెల్యే కూడా. తద్వారా ఆ నియోజకవర్గంలో దాదాపు ఏడు దశాబ్దాల పురుషాధిక్యతకు ఆమె ముగింపు పలికారు.
మరోవైపు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన కీర్తన, సీఎం విజయ్ క్యాబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలే కాకుండా ఏకైక మహిళా మంత్రి. బహుభాషలలో అనర్గళంగా మాట్లాడగల ఆమె, ప్రధానంగా హిందీ భాషపై తనకున్న పట్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. హిందీని వ్యతిరేకించే తమిళనాడులో ఇది ప్రాధాన్యత సంతరించుకున్నది.
అయితే తన పార్టీ ప్రాతినిధ్యాన్ని ప్రతిచోటా, భారతదేశమంతటా, చివరకు ఇతర దేశాలలో కూడా విస్తరించాలని తాను కోరుకుంటున్నానని కీర్తన తెలిపారు. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని చెప్పారు. ‘మా నాయకుడి గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి. నా పార్టీ గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి. రాజకీయాలంటే భయపడకూడదు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలి. నేను కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రాజకీయాల్లో చేరాలని నేను కోరుకుంటున్నా’ అని మీడియాతో ఆమె అన్నారు.
#WATCH | Chennai: Tamil Nadu Minister and TVK leader Selvi S. Keerthana says, “Everything is going to change, and the change is here. Thalapathy Chief Minister Joseph Vijay is here… Coming from such a middle-class family, getting such an opportunity as a candidate and being a… https://t.co/wdH1tBc7aq pic.twitter.com/fCuhXHCMcL
— ANI (@ANI) May 10, 2026