Freebies | ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఎలా ఆంక్షలు విధించాలన్న అంశంపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంలో రాజకీయ పార్టీలను ఎలా కట్టడి చేయాలనే దానిపై లోతైన చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉచితాల ఖర్చు, ప్రయోజనాలపై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎలా విద్యనందించాలనే దానిపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ గవర్నర్ అన్నారు. ఇది రాజకీయ అంశమని.. దీనిపై రాజకీయంగా ఏకాభిప్రాయం ఉండాలని భావిస్తున్నానన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నాయకత్వం వహించాలన్నారు. ఇందు కోసం శేతపత్రం విడుదల చేసి.. దానిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలన్నారు.
ఫ్రీబీస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దీన్ని ఎలా అరికట్టగలమో.. ఎలా అమలు చేయగలమో ప్రభుత్వం నిర్ధారించాల్నారు. భారత్‌లాంటి పేద దేశంలో అత్యంత బలహీన వర్గాలకు కొంత భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్న ఆయన.. ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఉంచుకొని వాటిని ఎంత వరకు అమలు చేయగలమో సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత హామీలపై మరింత అవగాహన ఉండాలని భావిస్తున్నానన్నారు. అదే సమయంలో తీవ్రంగా చర్చించాలని.. రాజకీయ పార్టీలపై నియంత్రణ ఎలా విధించవచ్చో మార్గం కనుగొనాలన్నారు. కొన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఉల్లంఘిస్తున్నాయని.. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించాలన్నారు. ఎఫ్ఆర్బీఎం లక్ష్యాలను అనుసరించాలన్నారు.
ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఏటా 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనవంటి పలు దేశాలు దీన్ని సాధించగలిగాయన్న ఆయన.. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాల వంటి సవాళ్ల మధ్య భారత్ దాన్ని ఎంత వరకు కొనసాగించగలదనేది చెప్పడం కష్టమేనన్నారు. అభివృద్ధి చెందిన దేశానికి చట్టబద్ధ పాలన, బలమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్టమైన సంస్థలు నాలుగు స్తంభాల్లాంటివని.. ఈ నాలుగు మనకు లేవని చెప్పలేమని.. అదే సమయంలో ఉన్నాయనీ అనుకోలేని పరిస్థితి ఉందన్నారు. వాటిని మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.