లక్నో: ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని అనుమానాస్పదంగా మరణించింది. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ హాస్పిటల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. (Villagers Vandalise Hospital) పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. భదర్గంజ్లో నివసించే 21 ఏళ్ల యువతి నాలుగేళ్లుగా ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నది. గురువారం రాత్రి ఆమె అనుమానాస్పదంగా మరణించింది.
కాగా, రాత్రి వేళ తనను హాస్పిటల్‌కు పిలిచారని, అయితే తన కుమార్తె మృతదేహాన్ని చూపించలేదని దివ్యాంగురాలైన మృతురాలి తల్లి తెలిపింది. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది తన కుమార్తె మృతదేహాన్ని ఇంటి వద్దకు చేర్చారని చెప్పింది. అయితే ఆమె శరీరంపై దుస్తులు లేకపోవడం, గాయాలు ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు ఆసుపత్రి సిబ్బందిని పట్టుకున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బందితో సహా ఆరుగురు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహించారు. శుక్రవారం ఉదయం ఆ హాస్పిటల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రిని ధ్వంసం చేశారు. పరిస్థితిని నియంత్రించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో సర్కిల్ ఆఫీసర్ (సీవో)తో సహా 12 మంది పోలీసులు గాయపడ్డారు.
కాగా, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అలాగే ఆ హాస్పిటల్ బయట భారీగా పోలీసులను మోహరించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళ కుటుంబం ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆధారాల సేకరణ కోసం మెడికల్ ప్యానెల్ ఆధ్వర్యంలో వీడియో రికార్డ్ ద్వారా పోస్టుమార్టం నిర్వహిస్తామని వెల్లడించారు.