తిరువనంతపురం : కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు.. మే 20న కొలువుదీరే కొత్త కేబినెట్లో చోటు లభించలేదు. త్వరలో కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో అందరూ కొత్తవారే. మరి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శైలజ స్థానంలో మరో మహిళనే సీఎం పినరయి విజయన్ భర్తీ చేస్తున్నారు. ఎమ్మెల్యే వీణ జార్జ్ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. పట్టణమిట్ట జిల్లాలోని ఆరన్మూల నియోజకవర్గం నుంచి వీణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లోనూ అదే స్థానం నుంచి ఆమె విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు వీణ జర్నలిస్టుగా పని చేసింది. ఇక సీఎం విజయన్ వద్ద హోం, ఐటీతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలను ఉంచుకోనున్నారు.