న్యూఢిల్లీ: భారత్లోని ఒక కంపెనీ తయారుచేసే వంటపాత్రలు ఆరోగ్యానికి ఏమంత మంచివి కావని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) హెచ్చరించింది. సరస్వతి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసే వంటపాత్రలు ఉపయోగానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, కాబట్టి వాటిని వినియోగించవద్దని సూచించింది. టైగర్ వైట్ బ్రాండ్ పేరుతో ఈ సంస్థ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఇవి స్వచ్ఛమైన అల్యూమినియం పాత్రలుగా మార్కెట్ అవుతున్నాయని పేర్కొంది.
అయితే, ఈ కంపెనీ తయారుచేసే వంటపాత్రలు ఆహారంలోకి ప్రమాదకర స్థాయిలో లెడ్ (సీసం)ను విడుదల చేస్తున్నట్టు యూఎస్ఎఫ్డీఏ పరీక్షల్లో తేలింది. అల్యూమినియం, ఇత్తడి, అల్యూమినియం మిశ్రమాలతో తయారుచేసే వంట పాత్రలను వంట కోసం ఉపయోగించినప్పుడు అవి సీసాన్ని విడుదల చేస్తాయని పరీక్షల్లో తేలినట్టు అమెరికన్ ఏజెన్సీ పేర్కొంది. వంటపాత్రలు కలిగించే హానిని దృష్టిలో పెట్టుకుని రిటైలర్లు అమ్మకాన్ని నిలిపివేయాలని, ఈ ఉత్పత్తులను వంటపాత్రలుగా లేదా, ఆహార నిల్వకోసం ఉపయోగించకూడదని యూఎస్ఎఫ్డీఏ తెలిపింది.