FedEx plane : న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఫెడెక్స్ కార్గో విమానం పక్షిని ఢీకొట్టింది. ఆ వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇంజిన్‌లో మంటలు రావడంతో విమానం నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందని న్యూయార్క్, న్యూజెర్సీ పోర్ట్ అథారిటీ ప్రతినిధి లెనిస్ వాలెన్స్ తెలిపారు.
ఈ ఘటనలో విమాన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు ఇంజిన్‌కు మాత్రమే పరిమితం అయ్యాయని వాలెన్స్ చెప్పారు. అత్యవసర ల్యాండింగ్ కోసం ముందు జాగ్రత్త చర్యగా విమాన రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. ఆ తర్వాత రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఫెడెక్స్ ప్రతినిధి మాట్లాడుతూ విమానం ఇండియానాపోలిస్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుందని చెప్పారు.