న్యూఢిల్లీ: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ (Puja Khedkar) అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. అలాగే ఆమె జీవితాంతం సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్ష రాయకుండా నిషేధం విధించింది. 34 ఏళ్ల పూజా ఖేద్కర్ నకిలీ గుర్తింపుతో పలుసార్లు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసినట్లు యూపీఎస్సీ ఆరోపించింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష నిబంధనలను ఉల్లంఘించిన వ్యవహారంలో దోషిగా తేలిన ఆమెపై చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.
కాగా, నకిలీ గుర్తింపు కార్డులతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తేలిన పూజా ఖేద్కర్ ప్రతిస్పందన కోసం జూలై 25న షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. ఆగస్ట్ 4 వరకు ఆమె గడువు కోరగా జూలై 30 వరకు సమయం ఇచ్చినట్లు చెప్పింది. గడువు పొడిగించబోమని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు పొడిగించిన చివరి గడువులోగా పూజా నుంచి ఎలాంటి వివరణ, ప్రతిస్పందన రాలేదని యూపీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమె సివిల్ సర్వీసెస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొంది. అలాగే భవిష్యత్తు పరీక్షల నుంచి పూజాను డిబార్ చేసినట్లు ప్రకటించింది.
కాగా, పూజా ఖేద్కర్ నకిలీ గుర్తింపు వివాదం నేపథ్యంలో 2009 నుంచి 2023 వరకు 15,000 మందికిపైగా ఐఏఎస్ అభ్యర్థుల వివరాలను మళ్లీ పరిశీలించినట్లు యూపీఎస్సీ తెలిపింది. సీఎస్ఈ నిబంధనల ప్రకారం అనుమతించిన దాని కంటే ఆమె మాదిరిగా ఎక్కువసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎవరూ లేరని పేర్కొంది.
మరోవైపు పూజా ఖేద్కర్ తన పేరునే కాకుండా తల్లిదండ్రుల పేరును కూడా మార్పు చేయడంతో ఆమె ఎక్కువ సార్లు సివిల్స్‌కు హాజరుకావడాన్ని గుర్తించడంలో విఫలమైనట్లు యూపీఎస్సీ వివరించింది. భవిష్యత్తులో ఇలా జరుగకుండా సంబంధిత నియమావళి, సెలక్షన్ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించింది.