Nitin Gadkari | నాగ్‌పూర్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రధానమంత్రి పదవిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ పదవికి పోటీపడితే మద్దతిస్తామంటూ గతంలో ఓ ప్రతిపక్ష నేత నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ప్రధాని పదవిని చేపట్టడం తన ఆశయం కానందున ఆ ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపారు. నాగ్‌పూర్‌లో శనివారం జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ప్రసంగిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ఓ సంఘటన గుర్తున్నది.
నేను ఎవరి పేరునూ చెప్పను. మీరు ప్రధానమంత్రి కావాలనుకుంటే మద్దతిస్తాం అని ఆ వ్యక్తి చెప్పారు. దీంతో మీరు నాకు ఎందుకు మద్దతివ్వాలి? మీ మద్దతును నేను ఎందుకు స్వీకరించాలి? అని నేను ప్రశ్నించా. ప్రధానమంత్రి కావడమే నా జీవితాశయం కాదు. నేను నా విశ్వాసానికి, నా సంస్థకు విధేయుడిని. ఆ విషయంలో నేను రాజీపడను. ఏదైనా పదవి కంటే నా విశ్వాసమే నాకు ముఖ్యమైనది’ అని చెప్పారు. అయితే ఆ సంభాషణ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో జరిగిందో గడ్కరీ చెప్పలేదు.
ప్రధాని పదవికి పోటీపడితే మద్దతిస్తామంటూ గతంలో ఓ ప్రతిపక్ష నేత నుంచి ఆఫర్ వచ్చిందని గడ్కరీ ప్రకటించడంపై శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఘాటుగా స్పందించారు. దేశ ప్రధాని కావాలన్న సొంత కోర్కెను వ్యక్తం చేసేందుకే గడ్కరీ ఈ ప్రకటన చేశారని, తద్వారా తన కోర్కెను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సందేశాన్ని పంపారని ఆమె పేర్కొన్నారు. ‘నితిన్ జీ.. ప్రతిపక్షాలను అడ్డం పెట్టుకుని మీరు ఆడిన నాటకం అద్భుతంగా ఉన్నది. దేశాన్ని నడిపించగలిగే సమర్థ నాయకులు ఇండియా కూటమిలో ఎంతో మంది ఉన్నారు. బీజేపీ నుంచి నాయకులను అరువు తెచ్చుకోవాల్సిన అగత్యం మాకు పట్టలేదు’ అని ప్రియాంక చతుర్వేది ‘ఎక్స్’లో పోస్టు చేశారు.