వారిద్దరూ అమ్మాయిలే.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని ఒకమ్మాయి కల. కానీ, స్వలింగ వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారా?.. తన కల నెరవేరుతుందా? అని మదనపడింది. కానీ, ఆమె కల నెరవేరింది. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో సాంప్రదాయ పద్ధతిలో తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నది.
సుభిక్షా సుబ్రమణిది తమిళ బ్రాహ్మణ కుటుంబం. కెనడాలోని కాల్గరీలో నివసిస్తున్నారు. టీనాదాస్ బంగ్లాదేశ్ హిందువు. వీరిద్దరికీ కెనడాలో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సుభిక్షా.. తమ కుటుంబ సభ్యులు సమక్షంలో తమిళ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని కలగన్నది. ఇందుకు ఆమె తల్లి ఒప్పుకున్నది. కానీ, తండ్రి వెనుకడుగేశాడు. తమిళనాడులో కాకుండా కెనడాలో పెళ్లిచేయాలనుకున్నాడు. అయితే, కెనడాలో బంధువులు ఎవ్వరూ లేరని, అందరిముందూ పెళ్లి చేసుకోవాలనేదే తన కల అని సుభిక్షా తన తండ్రికి చెప్పింది. ఈ విషయాన్ని తమిళనాడులోని బంధువులకు చెబితే ఎవరూ అడ్డుచెప్పలేదు. దీంతో వెంటనే తమిళనాడుకు వచ్చి సుభిక్షా, టీనా వివాహాన్ని తమిళనాడు సాంప్రదాయంలో జరిపించారు. టీనాకూడా తన భాగస్వామికి మద్దతుగా నిలిచింది. తాను తమిళనాడుకు రావడం ఇదే మొదటిసారని, పెళ్లి చాలా అద్భుతంగా జరిగిందని టీనా తెలిపింది.