Jahangir Khan : పశ్చిమ బెంగాల్‌లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎన్నిక జరగడానికి రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇది టీఎంసీ పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 21న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.
నిజానికి ఇక్కడ గత నెలలోనే ఇతర నియోజకవర్గాలతో కలిపి ఎన్నిక నిర్వహించారు. అయితే, ఎన్నిక జరిగిన రోజు ఇక్కడ ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. ఇదే సమయంలో ఈవీఎంలు సరిగ్గా పని చేయలేదు. ఈవీఎంల పనితీరుపైనా విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పుడు జరిగిన ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఈ నెల 21, గురువారం తిరిగి ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించనుంది. నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్‌లలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నిక జరగనుంది. గతంలోలాగా ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి దేవాన్షు పాండా, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ రజాక్ మొల్లా, సీపీఎం నుంచి శంభు నాథ్ కుర్మి ప్రధానంగా పోటీ పడుతున్నారు. టీఎంసీ నుంచి నామినేషన్ వేసిన జహంగిర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జహంగిర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. ‘‘నేను ఫాల్టా నియోజకవర్గపు బిడ్డను. ఫాల్టా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధి చెందాలి. ఫాల్టా అభివృద్ధికి మన సీఎం సువేందు అధికారి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అందుకే మన నియోజకవర్గం అభివృద్ధి కోసం పోటీ నుంచి తప్పుకొంటున్నా” అంటూ జహంగిర్ ప్రకటించారు.