మొరాదాబాద్: ప్రవేశ్ చావ్లా..! ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరుగుజ్జు..! ఆయన ఎత్తు కేవలం మూడు అడుగుల ఎనిమిది అంగుళాలు (3.8 అడుగులు)..! ఆయన వీధుల్లో నడిచి వెళ్తుంటే జనం ఆసక్తిగా చూస్తుంటారు. కొందరైతే ఆయన ఎత్తును చూసి నవ్వుకుంటారు. ఎప్పుడూ తన ఎత్తుతో స్థానికులను ఆకట్టుకునే చావ్లా.. ఇప్పుడు ఏకంగా ఎన్నికల బరిలో దిగాడు.
మొరాదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయన ఒక వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసిన ప్రవేశ్ చావ్లా.. తనను గెలిపించాలని కోరుతూ ఇప్పుడు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరుగుజ్జు అయిన ప్రవేశ్ తనకంటే రెండింతలు ఎత్తయిన అనుచరుల మధ్య నడుస్తూ ప్రచారం చేస్తుంటే స్థానికుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రచారంలో ఉన్న ప్రవేశ్ను మీడియా ప్రతినిధులు పలుకరించగా.. తన ఎత్తే తన అదృష్టమని చెప్పారు. తాను ఎత్తు తక్కువగా ఉన్నందుకే మీడియా తనను ఇంటర్వ్యూ చేస్తున్నదని చమత్కరించారు. మరుగుజ్జుగా జన్మించడం తనకు కలిసొచ్చిందని, ఎత్తు తక్కువగా ఉన్నందుకు తాను ఎన్నో ప్రయోజనాలు పొందానని అన్నారు. తన ఏరియాలో చెత్తాచెదారం, మురికి పేరుకుపోయాయని, ఎన్నికల్లో గెలిస్తే ఏరియాను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన కర్తవ్యమని ప్రవేశ్ తెలిపారు.