న్యూఢిల్లీ: భారత్లోని క్రిమినల్ చట్టాల్లో పరువునష్ట నేరాలకు సంబంధించిన చట్టాన్ని కొనసాగించాలని లా కమిషన్ సిఫారసు చేసింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ దేశంలోని పౌరులందరికీ పరువు హక్కును కల్పిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమని పరువు నష్ట నేర చట్టంపై రూపొందించిన నివేదికలో ఉద్ఘాటించింది. జీవన, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో ఓ కోణంగా ఉన్న పరువు హక్కుకు విద్వేష ప్రసంగాలు, ఆరోపణల నుంచి ‘తగినంత రక్షణ’ కల్పించాల్సిన అవసరమున్నదని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని నిరోధించేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆస్తుల విధ్వంసం జరిగినపుడు నమోదయ్యే కేసుల్లో నిందితులు బెయిల్ పొందాలంటే, తాము ధ్వంసం చేసిన ఆస్తి విలువకు సమానమైన సొమ్మును జమ చేయవలసి ఉంటుందని కమిషన్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తున్నది.