న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాజకీయ విశ్లేషకుడు తెహ్సీన్ పూనావాలా ఆదివారం ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో పోలీసుల బారికేడ్లను దాటుకుని వెళ్తున్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ20 ఇథనాల్ మిశ్రమాన్ని గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ఆయన తీవ్ర విమర్శలను చేశారు.
నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం బలగాలను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ‘షుగరు డాడీలు భయపడినప్పుడల్లా వారు పోలీసులను ముందుకు నెడతారని’ ఆయన గడ్కరీని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ20ని వెంటనే రద్దు చేసి తిరిగి ఈ10 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని, యూపీఐపై విధించిన చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సత్యనికేతన్ భవనం కూలిపోయిన క్రమంలో దానికి బాధ్యుడిని చేస్తూ ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ను అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ20 ఇంధనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నందునే ఆదివారం పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని పూనావాలా తెలిపారు. షుగర్, ఇథనాల్ పాలసీలు మరో భారీ కుంభకోణమని, ఈ20 ఇంధనం వాడితే వాహనాలు పాడైపోతాయని ఆయన ఆరోపించారు.