లక్నో: తన కూతురు ఒక అబ్బాయితో మాట్లాడటం చూసిన ఆమె తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. బంధువుతో కలిసి కుమార్తె గొంతు నొక్కి నదిలోకి తోసేశాడు. (Teenager Thrown Into River) ఆ యువతి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అలీగఢ్‌కు చెందిన 16 ఏళ్ల యువతి 9వ తరగతి చదువుతున్నది. ఒక అబ్బాయితో ఆమె మాట్లాడటాన్ని తండ్రి చూశాడు. అనంతరం కుమార్తెకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తిరస్కరించడంతో చంపాలని ప్లాన్ వేశాడు.
కాగా, గురుగ్రామ్‌లో పని చేసే తండ్రి అక్కడికి తీసుకెళ్తానని చెప్పి కుమార్తెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. సమీప గ్రామంలోని యమునా నదిపై ఉన్న బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న బంధువుతో కలిసి కూతుర్ని హత్య చేసేందుకు తండ్రి ప్రయత్నించాడు. వారిద్దరూ ఆమె గొంతు నొక్కి బ్రిడ్జీ పైనుంచి నదిలోకి తోసి పారిపోయారు.
మరోవైపు యమునా నదిలో పడిన ఆ యువతి తనను రక్షించాలని కేకలు వేసింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే నది ఒడ్డున ఉన్న ఈతగాళ్ల సహాయంతో ఆ అమ్మాయిని కాపాడారు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన తండ్రి, బంధువుపై కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసేందుకు వెతుకుతున్నారు. ఆ యువతిని షెల్టర్ హోమ్‌కు తరలించారు.