న్యూఢిల్లీ : కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌లలో ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును ట్రాక్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు వచ్చిన వార్తలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఖండించింది. ఉద్యోగుల పరికరాల్లో ఐటీ దిగ్గజ సంస్థ ‘డిజిటల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్ టూల్‌ను అమర్చిందని ‘మనీ కంట్రోల్’ ఒక నివేదికలో పేర్కొన్న తర్వాత టీసీఎస్ నుంచి ఈ వివరణ వచ్చింది.
‘ఉద్యోగులపై నిఘా ఉంచడం గురించి వచ్చిన వార్తలు నిరాధారమైనవి. టీసీఎస్ ల్యాప్‌టాప్‌లలో ఉద్యోగుల వ్యక్తిగత కార్యకాలాపాలను ట్రాక్ చేయదు. వారి గోప్యతను గౌరవిస్తుంది. మా ఉద్యోగుల భద్రత, లభ్యత, మెరుగైన వినియోగదారు అనుభవాన్ని నిర్థారించడానికి, స్థూల స్థాయి నెట్వర్క్ పనితీరును పర్యవేక్షించేందుకు మాత్రమే మేము టూల్స్ ఉపయోగిస్తాం’ అని టీసీఎస్ ‘ఇండియా టుడే టెక్’కు ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపింది.
కార్యాలయ పర్యవేక్షణపై ప్రశ్నలను ఎదుర్కొంటున్నది ఒక్క టీసీఎస్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమ అంతటా ఇలాంటి ఆందోళనలు ఉన్నాయి. ఐఏ సంబంధిత యాక్టివిటీని తెలుసుకునేందుకు కీస్ట్రోక్‌లు, మౌస్ కదలికల సమాచారాన్ని సేకరించే వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత ‘మెటా’ ఇటువంటి విమర్శలనే ఎదుర్కొంది. ఈ తరహా అంశం వివిధ దేశాల్లో న్యాయపరమైన పరిశీలనకు కూడా దారితీసింది. ఉద్యోగుల పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనలు వివిధ దేశాల చట్టాల ప్రకారం గణనీయంగా మారుతుంటాయి.