భరూచ్, అక్టోబర్ 10: బీజేపీ పాలిత యూపీలో దళితులపై మరో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దాష్టీకానికి దిగారు. ముగ్గురు దళిత బాలురను కొట్టి, వారికి గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఈ దారుణం యూపీలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో మంగళవారం జరిగింది. 5 కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12-14 ఏండ్ల వయసున్న ముగ్గురు బాలురను కోళ్లఫారాల యజమానులు నజీమ్, ఖాసింలు దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా వారికి శిరోముండనం చేయించారు.
ముఖానికి నల్ల రంగు పూశారు. రెండు చేతులు కట్టేసి, ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. బాధితుల కుబుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయగా, మాజీ గ్రామ పెద్ద పరారీలో ఉన్నాడు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు.