(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): పచ్చని భూగోళం రుధిర వర్ణంతో నిండిపోయింది. శీతాకాలంలోనూ వాతావరణం భగ్గుమంటున్నది. మధ్యాహ్నం ఎండ వేడిమి కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. మొన్నటికి మొన్న ఎల్నినోగా మొదలైన విపత్తు.. సూపర్ ఎల్నినోగా మారి, ఆ తర్వాత గాడ్జిల్లా ఎల్నినోగా పరిణామం చెంది ఇప్పుడు మరింతగా తీవ్రమయ్యింది. ఎంతగా అంటే, 150 ఏండ్ల కిందట ప్రపంచంపై విరుచుకుపడిన ఎల్‌నినో విపత్తును దాటేసి ఇప్పుడు ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’గా రూపాంతరం చెందింది.
ఈ మేరకు అమెరికాకు చెందిన వరల్డ్ మెటియొరాలాజికల్ ఆర్గనైజేషన్ పాటు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వచ్చే మూడు నెలల్లో ఈ సూపర్ డూపర్ ఎల్‌నినో ప్రభావం మరింతగా తీవ్రమై ఒకానొక దశలో పసిఫిక్ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.7 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా కొన్ని దేశాల్లో అతివృష్టి, భారత్ వంటి మరికొన్ని దేశాల్లో అనావృష్టి సంభవించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుత సూపర్ డూపర్ ఎల్‌నినో 1876-78లో వచ్చిన దాని కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నదని, అప్పటి కంటే తీవ్రమైన దుర్భర పరిస్థితులను తీసుకురావొచ్చని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
సూపర్ డూపర్ ఎల్‌నినో గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌నినో గురించి తెలుసుకోవాలి. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీపంలో పసిఫిక్ మహా సముద్ర జలాలు విస్తరించి ఉంటాయి. ఈ జలాలు అతిగా వేడెక్కితే, సముద్ర గాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో భారత్ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దృగ్విషయాన్నే ఎల్‌నినో అంటారు. సముద్రపు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగితే అది ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’కు దారితీస్తుంది. ఫలితంగా భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లో అనావృష్టి తాండవిస్తుంది.
కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. పసిఫిక్ మహా సముద్రపు ఉపరితల జలాలను పరిశీలించగా, మరోమారు అత్యధిక స్థాయికి ఉష్ణోగ్రతలు చేరినట్టు వెల్లడయ్యింది. ఇది గతంలోని బెంచ్ మార్క్ (0.5 డిగ్రీల సెల్సియస్) కన్నా 3 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదు కానున్నట్టు తెలిసింది. తమ అంచనాలు నిజమైతే, అక్టోబర్ మూడో వారంలో సూపర్ డూపర్ ఎల్‌నినో తొలి దశ మొదలై, డిసెంబర్ చివరినాటికి పతాకస్థాయికి రూపాంతరం చెందే అవకాశం 82 శాతం మేర ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2027 ఫిబ్రవరి వరకూ ఈ సూపర్ డూపర్ ఎల్‌నినో కొనసాగే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో వానలు కూడా అంతంత మాత్రంగానే కురిసాయి. వానకాలం సీజన్లోనే దేశంలో 65-70 శాతం వరకూ ధాన్యం దిగుబడి వచ్చే అవకాశమున్నది. అయితే, సూపర్ డూపర్ ఎల్‌నినో కారణంగా ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోవడంతో దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదని మరికొందరు అంచనా వేస్తున్నారు.
‘సూపర్ డూపర్ ఎల్ నినో’తో ఏమౌతుంది?
వానలు: భారత్ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది. ఫలితంగా కరువు పరిస్థితులు రావొచ్చు. మరికొన్ని తీరప్రాంత దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించొచ్చు.
ఎండలు: ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు చేస్తాయి.
తుపాన్లు: పసిఫిక్, హవాయి, పశ్చిమాసియా దేశాల్లో తుపానులు తీవ్రమవుతాయి. అట్లాంటిక్ మహా సముద్రంలో తుపాన్ల ఉద్ధృతి తగ్గుతుంది.
+0.5 డిగ్రీల సెల్సియస్ ఎల్‌నినో నిర్ధారణ
0.5-1 డిగ్రీల సెల్సియస్ బలహీన ఎల్‌నినో
1-1.5 డిగ్రీల సెల్సియస్ మధ్యస్థ ఎల్‌నినో
1.5-2 డిగ్రీల సెల్సియస్ బలమైన ఎల్‌నినో
2-3 డిగ్రీల సెల్సియస్ సూపర్ ఎల్‌నినో
3-3.5 డిగ్రీల సెల్సియస్ గాడ్జిల్లా ఎల్‌నినో
3.5 డిగ్రీల సెల్సియస్ ఆపైన సూపర్ డూపర్ ఎల్‌నినో