న్యూఢిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సీసాల్లోని నానో ప్లాస్టిక్లు యాంటీ బయాటిక్ నిరోధకతను పెంచే ప్రమాదం ఉందని మొహాలీలోని సూక్ష్మ శాస్త్ర, సాంకేతిక సంస్థ(ఐఎన్ఎస్టీ) శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్యం, యాంటీ బయాటిక్ నిరోధకతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ జర్నల్ నానో స్కేల్లో ప్రచురితమైన ఈ కొత్త అధ్యయనం ఇప్పటిదాకా గుర్తించని ప్రజారోగ్య ప్రమాదాన్ని గురించి నొక్కి చెప్పింది.
మానవ జీర్ణాశయ వ్యవస్థ(గట్)లోకి నానో ప్లాస్టిక్స్ చేరి సూక్ష్మజీవులతో కలుస్తున్నాయని, ఇవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని అధ్యయనం తెలిపింది. నానో ప్లాస్టిక్స్ యాంటీ బయాటిక్ నిరోధకత కలిగిన జన్యువులను లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ లాంటి ప్రయోజకర బాక్టీరియాలోకి చేరుస్తున్నాయని, దీంతో గట్ బ్యాక్టీరియా దెబ్బతింటున్నదని పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని తేల్చారు.