న్యూఢిల్లీ: పలువురిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్ కిల్లర్ (Serial Killer Arrested) పెరోల్‌పై బయటకు వచ్చి ‘అదృశ్యమయ్యాడు. ‘డాక్టర్ డెత్’ గా పేరొందిన అతడి కోసం రెండేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు. నకిలీ గుర్తింపుతో ఒక ఆశ్రమంలో పూజారిగా ఉన్న అతడ్ని చివరకు అరెస్ట్ చేశారు. 67 ఏళ్ల దేవేందర్ శర్మ ఆయుర్వేద వైద్యుడు. అయితే ‘డాక్టర్ డెత్’ గా పేరుగాంచిన ఆయన పలు హత్యలకు పాల్పడ్డాడు. 27 హత్య, కిడ్నాప్, దోపిడీ కేసులతో కూడిన సుదీర్ఘ నేర చరిత్ర అతడికి ఉన్నదని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) ఆదిత్య గౌతమ్ తెలిపారు.
కాగా, సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మ 1994లో గ్యాస్ డీలర్షిప్ వ్యాపారంలో నష్టపోవడంతో నేరాల బాటపట్టాడు. నకిలీ గ్యాస్ ఏజెన్సీని నిర్వహించడంతోపాటు అక్రమ అవయవ వ్యాపారంలోకి ప్రవేశించాడు. 1998- 2004 మధ్య అక్రమ కిడ్నీ రాకెట్‌ను నిర్వహించాడు. పలు రాష్ట్రాల వైద్యులు, మధ్యవర్తుల సహాయంతో 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిడికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని ఆ పోలీస్ అధికారి చెప్పారు.
మరోవైపు 2002-2004 మధ్య దేవేందర్ శర్మ తన అనుచరులతో కలిసి పలువురు టాక్సీ, లారీ డ్రైవర్లను దారుణంగా హత్య చేశాడు. నకిలీ ప్రయాణికులతో వారిని ట్రాప్ చేసి చంపేవాడు. ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లోని మెసళ్లున్న హజారా కాలువలో మృతదేహాలను పడేసి వాటికి ఆహారంగా వేసేవాడు. వారి వాహనాలను బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడని పోలీస్ అధికారి ఆదిత్య గౌతమ్ వివరించారు.
కాగా, కిడ్నీ రాకెట్, వరుస హత్యలకు సంబంధించి దేవేందర్ శర్మను 2004లో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలో నమోదైన ఏడు వేర్వేరు కేసుల్లో అతడికి జీవిత ఖైదు శిక్ష పడింది. గుర్గావ్ కోర్టు అతడికి మరణశిక్షను కూడా విధించిందని పోలీస్ అధికారి తెలిపారు. 2002-2004 మధ్య పలువురు టాక్సీ, లారీ డ్రైవర్లను దారుణంగా హత్య చేసిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని చెప్పారు. 2023 ఆగస్ట్‌లో పెరోల్ పొందిన అతడు మాయమయ్యాడని చెప్పారు. రాజస్థాన్ దౌసాలోని ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో పూజారిగా నటిస్తున్న దేవేందర్ శర్మను సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి ఆదిత్య గౌతమ్ వెల్లడించారు.
మరోవైపు పెరోల్‌పై ఉన్నప్పుడు దేవేందర్ శర్మ పరారీ కావడం ఇదే మొదటిసారి కాదు. 2020లో 20 రోజుల పెరోల్ తర్వాత తిరిగి జైలుకు వెళ్లలేదు. ఏడు నెలల తర్వాత ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. 2023 జూన్‌లో సరితా విహార్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అతడికి మళ్ళీ రెండు నెలల పెరోల్ మంజూరైంది. అనంతరం 2023 ఆగస్ట్ 3 నుంచి ఈ ఏడాది మే 19 వరకు ఆ సీరియల్ కిల్లర్ పరారీలో ఉన్నాడని పోలీస్ అధికారి ఆదిత్య గౌతమ్ విరించారు.