న్యూఢిల్లీ : ఇప్పటివరకు నమోదైన వాటిలోనే అత్యంత శక్తివంతమైన ‘సూపర్ ఎల్ నినో’ ప్రస్తుతం కొనసాగుతుండడంతో, ఈ వాతావరణ చక్రాన్ని మధ్యలోనే అడ్డుకోగల “మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్” అనే ఒక వివాదాస్పద పద్ధతిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మేఘాలను కృత్రిమంగా ప్రకాశవంతం చేయడం ద్వారా ఎల్ నినో వల్ల వచ్చే వరదలు, తీవ్రమైన వేడి, కార్చిచ్చుల నుంచి ప్రపంచాన్ని రక్షించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. వాతావరణంలోకి ఉప్పు వంటి చిన్న కణాలను ఇంజెక్ట్ చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రం పైనున్న మేఘాలను మరింత పరావర్తనం చెందేలా చేయవచ్చు. ఈ జియోఇంజినీరింగ్ సాంకేతికత ద్వారా ఎల్ నినో కారణంగా దిగువ వాతావరణంలోకి చేరే వేడి పరిమాణాన్ని తగ్గించవచ్చు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఈ పద్ధతి ఎంత శక్తివంతమైనదంటే, ఇది వేడిని కలిగించే ఎల్ నినో సంవత్సరాన్ని చల్లదనాన్ని ఇచ్చే లా నినా సంవత్సరంగా మార్చగలదు. సూపర్ ఎల్ నినో సంభవించడానికి ముందే పసిఫిక్ మహాసముద్రంలో మేఘాలను ప్రకాశవంతం చేయడం ద్వారాలా నినాతో ముడిపడి ఉన్న చల్లదనం, పొడి వాతావరణ ప్రభావాలను 40 శాతానికి పైగా పెంచవచ్చు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోకు చెందిన ైక్లెమేట్ సెంటిస్ట్, సహ రచయిత డాక్టర్ కాథరిన్ రిక్ మాట్లాడుతూ.. “ఇది జియోఇంజినీరింగ్ గురించి ఆలోచించే ఒక భిన్నమైన విధానం. మనం ఇంకా దీని గురించి చాలా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. కాని ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడానికి మనం దీనిని ఎందుకు పరిశీలించకూడదు?” అని అన్నారు. కానీ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుండడం, ఉద్గారాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గ్రహాన్ని కృత్రిమంగా చల్లబరచడానికి జియోఇంజినీరింగ్ను ఉపయోగించడం వల్ల కలిగే పరిణామాలను మరింత మంది పరిశోధకులు పరిశీలిస్తున్నారు. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతుల్లో ఒకటి మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. ఇది సముద్రంలోని కీలక ప్రాంతాలపైనున్న మేఘాలను మరింత పరావర్తనం చెందేలా చేస్తుంది. ఈ పరావర్తన మేఘాలు సహజమైన సన్స్క్రీన్లా పనిచేసి స్థానికంగా చల్లదనాన్ని కలిగిస్తాయి. ఇది ప్రపంచంలోని ఇతర భాగాల్లో వర్షాలు, గాలులు, అలల్లో మార్పులకు దారితీస్తుంది. ఈ విధానం ప్రత్యేకత ఏమిటంటే, సముద్రంలోని సరైన భాగాన్ని సరైన సమయంలో చల్లబరచడం ద్వారా మేఘాలు ప్రకాశవంతమైన ప్రాంతానికి ఆవల కూడా ప్రభావాలను చూపవచ్చు.
మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ను ఉపయోగించడం వల్ల కలిగే పరిణామాలు చాలా అనిశ్చితంగా ఉన్నాయి. నిజ జీవితంలో దీనిని పరీక్షించడం చాలా ప్రమాదకరమని పరిశోధకులు అంటున్నారు. అయితే 2019-2020లో ఆస్ట్రేలియా అడవిలో సంభవించిన అగ్నిప్రమాదంలో విడుదలైన భారీ పొగ మేఘాలు ఒక సహజ ప్రయోగాన్ని అందించాయి. ఈ అధ్యయన సహ రచయితల్లో ఒకరు నిర్వహించిన మునుపటి పరిశోధన ప్రకారం.. వాతావరణంలోకి చేరిన పొగ కణాలు జియోఇంజినీరింగ్లో ఉపయోగించే క్లౌడ్ ఆల్టరింగ్ ఏరోసోల్స్లా పనిచేశాయి. ఈ పొగ వల్ల ప్రకాశవంతంగా మారిన మేఘాలు ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రం అంతటా వ్యాపించి చల్లని లా నినా వంటి వాతావరణ పరిస్థితులను సృష్టిస్తాయి. దీంతో ప్రేరణ పొందిన పరిశోధకులు సూపర్ ఎల్ నినోకు ముందు ఇలాంటిదే జరిగితే ఎలా ఉంటుందో అనుకరించడానికి నిర్ణయించుకొన్నారు. ఈ పద్ధతి పెరుగుతున్న ఎల్ నినో ప్రభావాలను తగ్గిస్తుందని వారు కనుగొన్నారు. ప్రస్తుత సూపర్ ఎల్ నినోపై ఈ పద్ధతిని పరీక్షించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి తమ వద్ద లేవని చెప్తున్నారు.