IND Vs PAK Match | ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా దాదాపు రూ.1.5లక్షలకోట్ల విలువైన బెట్టింగ్ జరిగిందని శివసేన యూబీటీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ బెట్టింగ్లో రూ.25వేలకోట్లు పాకిస్తాన్కు చేరాయని.. ఈ మ్యాచ్ ద్వారానే పీసీబీ రూ.1000 కోట్లు సంపాదించిందని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బునంతా తిరిగి మనపై ఆ దేశం ఉపయోగిస్తుందని.. ఈ విషయం ప్రభుత్వం, బీసీసీఐకి తెలియదా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ, మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. ఇదో మోసపూరిత చర్యగా అభివర్ణించారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య మరింత ఘర్షణ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాక్కు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే మ్యాచులు ఆడడం అర్థం చేసుకోలేనిదని.. ఇంత పెద్ద బెట్టింగ్ రాకెట్ ప్రభుత్వం కళ్ళు తెరవడానికి సరిపోతుంది’ అని రౌత్ పేర్కొన్నారు.
మరో వైపు కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పాక్తో మ్యాచ్ ఆడకూడదని తాను మొదటి నుంచి చెబుతున్నానని.. ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది పహల్గామ్లో మరణించిన వ్యక్తులకు, మన సైనికులకు అవమానమన్నారు. ప్రభుత్వం స్పష్టంగా దేశభక్తి కంటే లాభాన్ని ఎంచుకుందన్నారు. ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరచాలనం ఓ నాటకమని.. ఎవరిని మోసం చేస్తున్నారు? జాతీయవాదులంతా ఎక్కడికి వెళ్లారు? అంటూ నిలదీశారు. కెప్టెన్ ఆడేందుకు నిరాకరించి ఉంటే అభినందించేవాడనని.. దురదృష్టవశాత్తు ‘మెన్ ఇన్ బ్లూ’ బీసీసీఐ కాంటాక్ట్ కార్మికులు తప్ప మరేమీ కాదన్నారు.