న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: గ్రామీణ ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. దేశవ్యాప్తంగా ఏకరూపంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌ల కోసం ఒకే విధమైన 25 రోజుల వ్యవధిని తక్షణమే అమలు చేయాలని కేంద్రం చమురు మార్కెటింగ్ కంపెనీలను(ఓఎంసీలు) ఆదేశించినట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సోమవారం ప్రకటించారు.
దీంతో గతంలో రీఫిల్ బుకింగ్‌ల మధ్య ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చిన గ్రామీణ ప్రాంతాల ఎల్పీజీ వినియోగదారులు ఇకపై పట్టణ ప్రాంత వినియోగదారులతో సమానంగా 25 రోజుల తర్వాతే తమ తదుపరి సిలిండర్‌ను బుక్ చేసుకునే వెసులుబాటును పొందుతారు. దేశీయ ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటం, పెండింగ్‌లో ఉన్న రీఫిల్ బకాయిలు తగ్గడం వంటి కారణాలను పేర్కొం టూ కేంద్ర మంత్రి ఫేస్బుక్ పోస్ట్‌లో ఈ మార్పును ప్రకటించారు.
పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించిన సరఫరా ఒత్తిళ్ల నేపథ్యంలో ఆంక్షలు విధించిన తర్వాత ఈ సవరించిన బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. వినియోగదారులు పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారా అనేదానిపై ఆధారపడి ప్రభుత్వం గతంలో వేర్వేరు బుకింగ్ వ్యవధులను ప్రవేశపెట్టిందని సురేష్ గోపి తెలిపారు. పట్టణ ఎల్పీజీ వినియోగదారులు 25 రోజుల తర్వాత రీఫిల్ బుక్ చేసుకోగలిగితే గ్రామీణ వినియోగదారులకు నిరీక్షణ వ్యవధి 45 రోజులుగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం తక్షణమే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.