న్యూఢిల్లీ : భూమిపైన జరుగుతున్న ప్రమాదకరమైన అణు కార్యకలాపాలపై గ్రహాంతరవాసులు నిఘా పెట్టి ఉండవచ్చునని తాజా అధ్యయనం అంచనా వేస్తున్నది. స్వీడన్‌లోని నోర్డిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్‌కు చెందిన డాక్టర్ బీట్రిజ్ విల్లరోయెల్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. అణు శకం ప్రారంభ సమయంలో జరిగిన అణు పరీక్షలను మానవేతర నిఘా పరిశీలించి ఉండవచ్చునని ఈ నివేదిక పేర్కొంది. 1949 నుంచి 1957 మధ్య కాలంలో అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ అణు పరీక్షలను నిర్వహించాయి. ఆ సమయంలో ఆకాశంలో వింత సంఘటనలు జరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ సంఘటనలను ట్రాన్సియెంట్స్ (తాత్కాలిక అతిథులు) అని పేర్కొంది. ఖగోళ చిత్రాల్లో ఈ ట్రాన్సియెంట్స్ అకస్మాత్తుగా, నక్షత్రాల వంటి వెలుగుతో కనిపించినట్లు తెలిపింది. ఇవి కనిపించినంత వేగంగానే మాయమైపోయాయని వివరించింది. 1957లో మానవుల మొదటి ఉపగ్రహం స్ఫుత్నిక్ను ప్రారంభించడానికి చాలా కాలం ముందే ఇవి కనిపించినట్లు తెలిపింది. అణు పరీక్ష జరగడానికి కాసేపటి ముందు, తర్వాత ఈ గుర్తు పట్టలేని ప్రకాశవంతమైన వస్తువులు కనిపించే అవకాశం 45% ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. కేవలం అణు పరీక్షలు జరిగే రోజుల్లోనే ఫొటోలకు చిక్కిన ఈ వస్తువుల సంఖ్య 8.5% పెరిగిందన్నారు.
కాలిఫోర్నియాలోని పలోమార్ అబ్జర్వేటరీ స్కై సర్వేలో ఉన్న వేలాది చారిత్రక ఫొటోలను ఈ అధ్యయనంలో పరిశోధకులు విశ్లేషించారు. భూమి ఉపరితలంపై నిర్వహించిన 124 అణు పేలుళ్ల చిత్రాలు కూడా వీటిలో ఉన్నాయి. భూగర్భంలో పరీక్షలకు ప్రామాణికత లభించడానికి ముందు భూమి పై భాగంలో నిర్వహించిన పరీక్షల వల్ల రేడియోధార్మికత, ప్రకంపనలు వాతావరణంలోకి విడుదలయ్యాయి. ఈ ట్రాన్సియెంట్స్ సమతలంగా, అద్దం మాదిరిగా, గిరగిరా తిరుగుతూ, ఫ్లయింగ్ సాసర్ ఆకారంలో ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. స్ఫుత్నిక్ 1ను ప్రయోగించడానికి పూర్వమే ఈ వస్తువులు కనిపించాయన్నారు. ఈ విధంగా కనిపించే సహజ వస్తువులు ఉన్నట్లు వ్యక్తిగతంగా తనకు తెలియదని విల్లరోయెల్ చెప్పారు. ఈ అధ్యయనం పీర్ రివ్యూలో విజయవంతమైంది. ఇతర శాస్త్రవేత్తలు ఈ డాటాను పరీక్షించి, దీనిని తోసిపుచ్చడానికి తగిన కారణాలు లేవని నిర్ధారించారు. శాస్త్రవేత్తలు పరిశీలించిన ఆకాశ ప్రాంతాలన్నిటిలోనూ, 1 లక్షకుపైగా ట్రాన్సియెంట్లను గుర్తించారు. ఉత్తరార్ధ గోళంలోనే దాదాపు 35,000 కనిపించాయి.