న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఆప్ ఎంపీ రాఘవ చద్దాపై విధించిన సస్పెన్షన్ను రాజ్యసభ ఎత్తివేసింది. సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని సోమవారం ఆమోదించింది. ఓ తీర్మానంపై తోటి సభ్యుల అనుమతి లేకుండానే సంతకాలు చేశారన్న ఆరోపణలపై రాఘవ చద్దాను గత ఆగస్టులో సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. రాఘవ చద్దాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కమిటీ తేల్చింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న చైర్మన్ ధన్కర్.. ఇప్పటికే రాఘవ చద్దా సభకు హాజరుకాకుండా 100 రోజులకుపైగా వేటు వేశానని, అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మద్దతు తెలుపడంతో ఈ వేటును తొలగిస్తున్నానని చెప్పారు. చైర్మన్ నిర్ణయంపై రాఘవ చద్దా సంతోషం వ్యక్తం చేశారు.