మంగళవారం 19 జనవరి 2021
National - Nov 29, 2020 , 17:15:19

మట్టికప్పుల్లోనే టీ విక్రయించేలా చర్యలు : పీయూష్‌ గోయల్‌

మట్టికప్పుల్లోనే టీ విక్రయించేలా చర్యలు : పీయూష్‌ గోయల్‌

హైదరాబాద్‌ : దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌లో మట్టికప్పుల్లో మాత్రమే టీ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో నూతనంగా విద్యుద్దీకరించిన  ధీగవారా-బండికుయ్ రైల్వేలేన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు రైల్వేశాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఇప్పటికే దేశంలోని 400 రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లో టీ విక్రయిస్తున్నారని, ఇదే విధానాన్ని అన్ని రైల్వేస్టేషన్‌లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పర్యావరణానికి మేలు జరగడంతోపాటు లక్షల మందికి ఉపాధి సైతం లభిస్తుందన్నారు. అంతకుముందు మట్టికప్పులో టీ తాగిన ఆయన రుచి అద్భుతంగా ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వం రాజస్థాన్‌లో రైల్వే ప్రాజెక్టులతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గడిచిన ఆరేండ్లలో రాజస్థాన్‌కు అనేక ప్రాజెక్టులు కేటాయించామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.