న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులను శిక్షించడం, శిక్షాత్మక చర్యలకు పాల్పడటం చేయరాదని, అలాంటి చర్యలు అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘అసహనం రాజ్యాంగానికి విరుద్ధం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ధిక్కార చర్య కాదు. అది పౌరసత్వం, స్వేచ్ఛ, రాజ్యాంగ బాధ్యత ముఖ్యమైన వ్యక్తీకరణ’ అని ఆయన తెలిపారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్య కాంత్‌ను పిలవరాదని ఇటీవల హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్ణయించడం, దానిపై బార్ కౌన్సిల్ చైర్మన్ స్పందించి వారిని బార్ కౌన్సిల్లో నమోదు చేయరాదంటూ ఆదేశాలు ఇవ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో ఉజ్జల్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు, వివిధ అంశాలపై ప్రశ్నించినప్పుడు వారిని ఎంతమాత్రం బెదిరించరాదన్నారు. అది రాజ్యాంగ విరుద్ధం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని అన్నారు. పౌరులందరిలో ఏకాభిప్రాయం ఉండాలని రాజ్యాంగం ఎన్నడూ కోరదని, భిన్నాభిప్రాయాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న విశ్వాసాలు కలిగిన పౌరులు సమాన గౌరవంతో జీవించగలరు. ఉమ్మడి ప్రజాస్వామ్య జీవితంలో పాల్గొనగలరు అన్న విషయాన్నే రాజ్యాంగం చెబుతున్నదన్నారు. ఈ సందర్భంగా భిన్నాభిప్రాయాలను సహించాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ‘ఒక స్వేచ్ఛా సమాజంలో విభిన్న అభిప్రాయాలు, నమ్మకాలు, ప్రపంచాన్ని చూసే విభిన్న దృక్కోణాలు ఉంటాయని రాజ్యాంగం గుర్తిస్తుంది. భిన్నాభిప్రాయాలకు చోటు ఉన్నప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ విస్తృతమైన అభిప్రాయంతో విభేదించే స్వేచ్ఛ, ప్రజా జీవితంలో పాల్గొనే స్వేచ్ఛకు అర్థం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.