న్యూఢిల్లీ, జూలై 21: పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో ప్రధాని మోదీ ఎట్టకేలకు నోరు విప్పారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ని ఘోర పాపంగా అభివర్ణించారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. పేపర్ లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యతని అన్నారు. నీట్ పేపర్ లీక్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. 13 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ఆయన అన్నారు. ఆశావహుల భవిష్యత్తును పరిరక్షించేందుకు మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రీఎగ్జామినేషన్ విజయవంతంగా జరిగి ఫలితాలు కూడా సకాలంలో వెలువడ్డాయని ఆయన తెలిపారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకే ప్రభుత్వం తక్షణం స్పందించిందని ఆయన చెప్పారు.
రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత
ఇటీవలి కాలంలో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏ) రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాయని, అలాగే రైతు సమాజం, దేశం రెండింటి కోసం కృషి చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతగా కొనసాగుతుందని, ఎఫ్‌టీఏలు వారి ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా వాటిని మరింత ముందుకు తీసుకువెళతాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి నిరసనగా రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.