న్యూఢిల్లీ, నవంబర్ 14: రాజకీయ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలను అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. విద్వేష ప్రసంగాలకు, తప్పుడు వాదనలకు మధ్య తేడా ఉందని ధర్మాసనం పేర్కొన్నది. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు వ్యతిరేకంగా కొంతమంది రాజకీయ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాల్ని అడ్డుకోవటంపై మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని ‘హిందూ సేనా సమితి’ ఈ పిల్‌ను దాఖలు చేసింది. సామాన్య పౌరులు, జర్నలిస్టుల పట్ల ఒకలా, రాజకీయ నేతల పట్ల ఒకలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఎంతో మంది రాజకీయ నేతలు తమ మాటలతో విద్వేషాల్ని రెచ్చగొట్టినా ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని ‘పిల్’లో పేర్కొన్నది.