ముంబై, జూలై 9: తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పొంది వారి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా, అశ్రద్ధతో వ్యవహరించే పిల్లలకు కనువిప్పు కలిగేలా బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే షరతుతో ఆస్తిని పిల్లలకు బదిలీ చేసిన తల్లిదండ్రులు, ఆ షరతును కనుక పిల్లలు నెరవేర్చకపోతే వారు తమ ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చునని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.
తల్లిదండ్రులు ఆర్థికంగా స్థితిమంతులైనప్పటికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. లోయర్ పారెల్‌లోని ఫ్లాట్‌ను తన 68 ఏండ్ల తండ్రికి స్వాధీనం చేయాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ 42 ఏండ్ల వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర చుగే, జస్టిస్ గౌతమ్ ఆంఖడ్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రాథమిక సౌకర్యాలు, శారీరక అవసరాలు కల్పిస్తాననే షరతులో ఆస్తి బదిలీ జరిగి, అలా చేయడంలో విఫలమైతే , ఆ బదిలీని రద్దు చేసే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని సీనియర్ సిటిజన్స్ చట్టం, 2007 సెక్షన్ 23 చెబుతున్నదని పేర్కొన్న హైకోర్టు.. ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తూ పిటిషనర్ వాదనను తిరస్కరించింది.