Padma awards : బంగ్లాదేశ్ విమోచనం కోసం జరిగిన యుద్ధంలో భారత్‌కు సహకరించిన పాకిస్థాన్ మాజీ సైనికుడికి దేశ అత్యంత పౌర పురస్కారం దక్కింది. లెఫ్టినెంట్ కల్నల్ ఖాజీ సజ్జాద్ అలీ జహీర్‌కు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ మంగళవారం అందజేశారు.
1971లో పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం ఖాజీ సజ్జాద్ అలీ జహీర్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. పాకిస్థాన్‌లోని సియాల్కోట్లో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న 20 ఏండ్ల సైనిక అధికారి జహీర్, నాటి ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో పాక్ సైన్యం దురాగతాలు, ఊచకోతలు, మానవ హక్కుల ఉల్లంఘనలను సహించలేకపోయారు.
ఇరువైపులా కాల్పులు జరుగుతున్నప్పటికీ పాక్ సైన్యాన్ని వీడిన జహీర్ భారత్ సరిహద్దులోకి ప్రవేశించారు. అయితే పాక్ గూఢాచారిగా అనుమానించిన సరిహద్దులోని భారత ఆర్మీ అధికారులు ఆయనను నిర్బంధించి ప్రశ్నించారు. కాగా, బంగ్లాదేశ్ వియోచనం కోసం భారత్‌కు మద్దతు ఇచ్చేందుకు తాను వచ్చినట్లు ఆయన చెప్పారు.
దీంతో జహీర్‌ను పఠాన్‌కోట్‌కు తరలించి ప్రశ్నించగా పాక్ ఆర్మీకి చెందిన కీలక రహస్య పత్రాలు, మ్యాపులను భారత ఆర్మీ అధికారులకు ఆయన అందజేశారు. అనంతరం ఆయనను ఢిల్లీలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారత నిఘా అధికారులు మరింత కీలక సమాచారం రాబట్టారు.
ఆ తర్వాత కొన్ని నెలలకు జహీర్ బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. బంగ్లా స్వేచ్ఛ కోసం పాక్ సైనికులతో పోరాడుతున్న బంగ్లా సమర యోధులు ముక్తి బాహినులకు గెరిల్లా యుద్ధ విద్యల్లో ఆయన శిక్షణ ఇచ్చారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్‌కు సహకరించిన ఆయన అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీకి సేవలందించారు.
దీంతో లెఫ్టినెంట్ కల్నల్ జహీర్‌ను భారత్ వీర్ చక్రతో సమానమైన శౌర్య పతకం బిర్ ఫ్రోటిక్ను బంగ్లాదేశ్ ప్రదానం చేసింది. అంతేగాక ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం స్వాధీనత పదక్‌తో ఆయనను సత్కరించింది.
కాగా, బంగ్లాదేశ్ ఆవిర్భంవించి 50 ఏండ్లు అయిన సందర్భంగా ఉప ఖండానికి 71 ఏండ్ల జహీర్ చేసిన సేవలను గుర్తించిన భారత్ ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. మరోవైపు ఇప్పటికీ ఆయనపై ద్వేషాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్, తన మాజీ సైనిక అధికారికి విధించిన మరణ శిక్షను ఇంకా పెండింగ్‌లో ఉంచింది.
అయితే దీనిని గౌరవ బ్యాడ్జ్‌గా తాను భావిస్తున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ఖాజీ సజ్జాద్ అలీ జహీర్ గర్వంగా పేర్కొన్నారు.