న్యూఢిల్లీ: నమీబియాలో తీవ్రమైన రీతిలో కరువు నెలకొన్నది. దీంతో అక్కడ కరువును పారద్రోలేందుకు స్థానిక ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే జంతవుల సంహరణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని వంతారా వన్యప్రాణి సంక్షేమ, సంరక్షణ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీలో ఉన్న నమీబియా కమీషనర్‌కు ఆ సంస్థ లేఖ రాసింది. జంతువుల సంరక్షణ(Animal Conservation) కోసం చర్యలు చేపట్టే అవకాశం తమకు కల్పించాలని ఆ దేశ కమీషనర్‌ను వంతారా వన్యప్రాణి సంస్థ కోరింది.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వంతారా సంస్థ.. భారీ ఎత్తున జంతు సంరక్షణ చేపడుతున్నది. సుమారు మూడు వేల ఎకరాల్లో వివిధ రకాల జంతువులకు రక్షణ కల్పిస్తున్నారు. అక్కడే జంతువుల బ్రీడింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. సుమారు రెండువేల రకాల జంతువులకు ఆ సంస్థ ఆశ్రయం కల్పిస్తున్నది. దీనికి సెంట్రల్ జూ అథారిటీ ఆమోదం కూడా ఉన్నది. రాధేకృష్ణ ఏనుగుల సంరక్షణ కేంద్రం కూడా ఈ సంస్థ ఆధీనంలోనే ఉన్నది. ఆ ట్రస్టు కింద ఉన్న మూడువేల ఎకరాల స్థలంలో జంతువులను పెంచుతున్నారు.
నమీబియాలో జంతువుల హననం జరుగుతున్న నేపథ్యంలో.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని భావిస్తున్న వంతారా సంస్థ ఆ దేశానికి తెలిపింది. తమ వద్ద ఉన్న సంరక్షణ కేంద్రాల్లో.. జంతువులకు ఆశ్రయం కల్పించనున్నట్లు వంతారా సంస్థ నమీబియాకు తెలిపింది. జంతువుల బలిని ఆపేందుకు చేపట్టాల్సిన చర్యలు తమ వద్ద ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఈ నేపథ్యంలో వంతారా సంస్థ సీఈవో వివాన్ కరణి .. నమీబియా కమీషనర్‌కు లేఖ రాశారు.