న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. 2022, జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల మధ్య వయసుగల టీనేజర్లకు టీకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ గత నెల 25న ప్రకటించారు. ఆ మేరకు జనవరి 3న టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి టీనేజర్లకు వ్యాక్సిన్లు ఇస్తున్నాయి.
దాంతో ఇవాళ మధ్యాహ్నం వరకే దేశంలో కోటి మందికిపైగా టీనేజర్లు తొలి డోస్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 15-18 ఏండ్ల ఏజ్ గ్రూప్లో అందరికీ కొవాగ్జిన్ టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా టీనేజర్లు తొలి డోస్ టీకాలు వేయించుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు.