మేదాంత హాస్పిటల్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సుశీలా కటారియా వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రానున్న రెండు వారాల్లో మరింత తీవ్రం కానున్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రాగల రెండు వారాల్లో కరోనా మహమ్మారి మరింత తీవ్రం కానున్నది. దాంతో ప్రజల్లో ఏ ఒక్కరూ నిశ్చింతగా ఉండరు’ అని ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సుశీలా కటారియా చెప్పారు. ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ ఉధృతమైందని, ఇది సాధారణ ఫ్లూ కాదని, ప్రమాదకరమైనదని అన్నారు.
కటారియా గత రెండేండ్లుగా ఎంతో మంది కొవిడ్ రోగులకు చికిత్స అందించారు. ఆమె ఇవాళ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘రానున్న రెండు వారాల్లో కరోనా తీవ్రత మరింత ఉధృతం కానున్నందున ఒక్కరూ నిశ్చింతగా ఉండరు. కొవిడ్ కేవలం సాధారణ ఫ్లూ కాదు. అది ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. జనవరి 4 నుంచి థర్డ్ వేవ్ ఉధృతమైంది. గత మూడు రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదింతలయ్యింది’ అని చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచమంతటా విస్తరిస్తున్నందున కరోనా మరింత తీవ్రమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని సుశీలా కటారియా అభిప్రాయపడ్డారు. అయితే డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ తీవ్రత కొంత తక్కువే అన్నది నిజమని చెప్పారు. ఇది మంచిదే అయినా, ఈ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆమె సూచించారు.