లక్నో: ఒడిశాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి.. ఆర్మీ కెప్టెన్(Army Captain) అని చెప్పుకుంటూ.. మహిళల్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్ అలీ అనే వ్యక్తి.. రిలేషన్షిప్ పేరుతో మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత వాళ్ల నుంచి లక్షల్లో డబ్బులు వసూల్ చేసేవాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తన పేరు హర్తిక్ బిగ్లో అని, ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఆఫీసర్‌ను అంటూ అతను పరిచయం చేసుకునేవాడు. ఆడవాళ్లతో పరిచయం పెంచుకున్నాక, ఏవేవో కారణాలు చెబుతూ వారి నుంచి డబ్బులు లాగేవాడు. డబ్బులు ముట్టిన తర్వాత ఇక అతను తన కమ్యూనికేషన్ ముగించేవాడు. ఆ తర్వాత మరో లొకేషన్‌కు వెళ్లి కొత్త టార్గెట్లను వెతికేవాడు అని తెలుస్తోంది. మహిళల్ని బెదిరించి వసూల్ చేసిన డబ్బుతో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే లక్నోలో ఓ మహిళ పరిచయం అయిన తర్వాత సీన్ మారింది. అతనిపై పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో .. ఆ వ్యక్తి నాటకాలు బయటపడ్డాయి. హైదరాబాద్, కేరళ, కర్నాటక, బెంగాల్ రాష్ట్రాల్లో హైదర్ అలీ సెక్యూర్టీ సంస్థల్లో పనిచేశాడు. ప్రతి సిటీలోనూ అతను మహిళల్ని వంచించినట్లు తెలుస్తోంది.
ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫోటోలను అతను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌లో పోస్టు చేసేవాడు. ఇండియన్ కమాండో హార్దిక్, ఆర్మన్బిగ్లో, ఆర్మీబెగ్లో, సోలడ్జర్స్3889 పేర్లతో అతను ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. ఆర్మీ దుస్తులు, త్రీస్టార్ ఫ్లాప్స్, ఆర్మీ బీరెట్, ఫేక్ ఆధార్ కార్డు, ఆర్మీ క్యాంటీన్ కార్డు లాంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని, డబ్బులు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పేర్కొన్నట్లు పోలీసు అధికారి నిపున్ అగర్వాల్ తెలిపారు. మతాన్ని చెప్పకుండానే అందరితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. అతని కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. నలుగురు మహిళలతో లింకు ఉన్నట్లు నిందితుడు అలీ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.