Women journalists : ఢిల్లీ (Delhi) లోని ఆప్ఘనిస్థాన్ (Afghanistan) రాయబార కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ (Press meet) కు మహిళా జర్నలిస్టుల (Women journalists) ను అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఈ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కోసం వచ్చిన మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను అవమానిస్తుంటే కేంద్రం ఏంచేస్తోందని విపక్ష పార్టీల నేతలు, నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
దాంతో ఈ అంశంపై కేంద్ర సర్కారు స్పందించింది. మహిళా జర్నలిస్టులను ప్రెస్ మీట్‌కు అనుమతించకపోవడంలో మా పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్‌కు జర్నలిస్టులను ఆహ్వానించే బాధ్యతను ముంబైలోని ఆఫ్ఘనిస్థాన్ కాన్సూల్ జనరల్ తీసుకున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తమ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి భారత పర్యటన నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వచ్చారని పేర్కొంది.
కాగా ప్రతిపక్షాలు కూడా ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘బహిరంగ కార్యక్రమానికి మహిళా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించడాన్ని మీరు ఎలా సమర్థిస్థారు..?’ అని ఆయన ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని దేశంలోని ప్రతి మహిళతో ‘మీకు అండగా నిలబడటంలో నేను బలహీనుడను’ అని చెప్పాలని సూచించారు.
‘ప్రధాని మోదీకి ఎన్నికలప్పుడే మహిళలు, మహిళల హక్కులు గుర్తుకొస్తాయా..?’ అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మౌనంగా ఉండటం ‘నారీ శక్తి’ అంటూ ఆయన ఇచ్చే నినాదాలను బలహీనం చేస్తున్నాయని విమర్శించారు.