Sanjay Raut : జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణపై సరైన పరిశోధన, సరైన సవరణలు జరగలేదని రౌత్ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోదీ 2029 వరకు పదవిలో కొనసాగుతాడనే నమ్మకం తనకు లేదని అన్నారు.
‘జమిలి ఎన్నికలకు సంబంధించి సరైన సవరణలు, పరిశోధన జరగలేదు. ప్రధాని ఎప్పుడూ తన మనసులోని మాటలు చెబుతుంటాడు. కానీ ప్రజల మనసులో ఏముంది..? ప్రతిపక్షాల మనసులో ఏముంది..? అనే విషయాలను గురించి ఆయన ఆలోచించరు. మోదీ 2029 వరకు ప్రధానిగా కొనసాగుతారనేది నాకు అనుమానమే. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఏర్పాటైన మీ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావు. అవి ఈవీఎంల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వాలు’ అని రౌత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎంపీలు కూడా జమిలి ఎన్నికలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు జరగడంవల్ల ఎన్నికల ఖర్చు భారీగా తగ్గిపోయి దేశ జీడీపీ 1.5 వరకు పెరిగే ఛాన్స్ ఉందని రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పడాన్ని కొందరు కాంగ్రెస్ ఎంపీలు తప్పుపట్టారు.