న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇండ్లు, ఆఫీసులను చల్లగా ఉంచుకునేందుకు మనం రోజూ నానా పాట్లు పడాల్సి వస్తున్నది. అందులో భాగంగా సూర్యకాంతి ప్రసరణను అడ్డుకునేందుకు ఉదయాన్నే తలుపులు, కిటికీలను మూసేసి కర్టెన్లతో కవర్ చేయడంతోపాటు చల్లదనం కోసం ఏసీలు, ఎయిర్ కూలర్లను ఉపయోగించాల్సి వస్తున్నది. దీంతో విద్యుత్తు బిల్లులు తడిసి మోపెడవటంతో పాటు మన ఇల్లు/ఆఫీస్ వెలుపలి ప్రాంతాలను చూసేందుకు వీల్లేకుండా పోతున్నది. ఈ సమస్యలకు పరిష్కారంగా అమెరికాలోని నోట్రె డామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్వాంటమ్ ఫిజిక్స్, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతల సాయంతో పారదర్శకంగా ఉండే సరికొత్త విండో కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. కంటికి కనిపించే కాంతి ప్రసరణకు మాత్రమే వీలుకల్పించడం, అతినీలలోహిత, పరారుణ కిరణాలను అడ్డుకోవడం దీని ప్రత్యేకత. పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ (కండ్లద్దాల) మాదిరిగా ఈ పూత గదిలోకి వచ్చే కాంతి తీవ్రతను తగ్గిస్తుందని, కానీ.. సన్గ్లాసెస్లా కాకుండా ఇది పారదర్శకంగా ఉంటుందని, కిటికీ అద్దాన్ని వివిధ కోణాల్లోకి వంచినప్పటికీ ఈ పూత ద్వారా వెలుపలి ప్రాంతాలను స్పష్టంగా చూడవచ్చని నోట్రె డామ్ వర్సిటీలోని ‘మాన్స్టర్’ ల్యాబ్ (మాలిక్యులర్/నానో-స్కేల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎనర్జీ లాబొరేటరీ) అధిపతి టెంగ్ఫీ లువో వివరించారు.