US Visa | న్యూఢిల్లీ, నవంబర్ 27: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం కొత్త నిబంధనలు విధించింది. వీసా దరఖాస్తు చేసుకొనేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు సోమవారం ఎక్స్‌లో తెలిపింది. ఈ నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నది. ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ సొంత పాస్‌పోర్టు నంబర్‌తో ప్రొఫైల్ తయారుచేసి పంపాలని సూచించింది.
తప్పుడు పాస్‌పోర్ట్ నంబర్ సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరించటంతోపాటు డిపాజిట్ చేసిన డబ్బును కూడా తిరిగి ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎఫ్, ఎం వీసా కోసం దరఖాస్తు చేసేవాళ్లు ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్, స్టూడెంట్ సర్టిఫైడ్ ప్రోగ్రాంలో తప్పనిసరిగా ఎన్రోల్ చేసుకోవాలి. జే వీసాకు దరఖాస్తు చేసేవాళ్లు అమెరికా విదేశాంగశాఖ గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్పాన్సర్షిప్ పొంది ఉండాలి. వీసా అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ప్రొఫైల్ సిద్ధం చేసుకొన్నవారు తమ పాస్‌పోర్ట్ అసలైన నంబర్‌తో ఆ దరఖాస్తులను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.