కోహిమా: సాయుధ దళాల ప్రత్యేక చట్టం (ఏఎఫ్ఎస్ఏ) 1958ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని నాగాలాండ్ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని ఈశాన్య ప్రాంతంలో, ప్రత్యేకించి నాగాలాండ్ నుంచి ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. నాగాలాండ్ సీఎం నీఫియు రియో అసెంబ్లీకి నాయకత్వం వహించి తీర్మానాన్ని ఆమోదింపజేశారు. నాగా శాంతి చర్చలను త్వరగా పరిష్కరించాలని అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ‘నాగాలాండ్, నాగా ప్రజలు ఎల్లప్పుడూ AFSPAని వ్యతిరేకించారు. దానిని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
నాగాలాండ్‌లో ఇటీవల తీవ్రవాదులుగా పొరపడిన భద్రతా దళాలు పౌరులపై కాల్పులు జరుపడంతో పది మందికిపైగా మరణించారు. ఈ ఘటనపై జనం ఆగ్రహంతో రగిలి ఆర్మీ వాహనాలకు నిప్పుపెట్టగా ఒక జవాన్ చనిపోయాడు. నాటి నుంచి నాగాలాండ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.