న్యూఢిల్లీ : అల్-ఫలా విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ వర్సిటీలో పని చేస్తున్న డాక్టర్లు ఉగ్రవాద నెట్‌వర్క్‌లో పట్టుబడిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఉన్నత విద్యా సంస్థలను మదింపు చేసి, గ్రేడ్లు ఇచ్చే అధికారం ఎన్ఏఏసీకి ఉంది. అల్-ఫలా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి, అల్-ఫలా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కు ఎన్ఏఏసీ ‘ఏ’ రేటింగ్స్ ఇచ్చినట్లు ఈ వర్సిటీ వెబ్సైట్ పేర్కొంది. దీనిని ఈ నోటీసుల్లో ఎన్ఏఏసీ ప్రస్తావించింది. ఇంజినీరింగ్ కళాశాలకు ‘ఏ’ గ్రేడ్ 2013లో వచ్చిందని, అది 2018 వరకు చెల్లుబాటవుతుందని, ఆ తర్వాత గడువు తీరిపోతుందని తెలిపింది.
అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి అఖిల భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) గట్టి షాక్ ఇచ్చింది. ఈ వర్సిటీ చట్టబద్ధ, ఆర్థిక, నియంత్రణ సంబంధిత నిబంధనలను పాటించడం లేదని మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నదని, అందువల్ల తమ సంఘంలో సభ్యత్వాన్ని తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఐయూ లోగోను ఏ విధంగానూ ఉపయోగించకూడదని ఈ వర్సిటీని ఆదేశించింది.