న్యూఢిల్లీ: లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన అట్లాంటిక్ విమానం టర్కీలోని దియార్బాకిర్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సుమారు 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. (Indian flyers stuck) 16 గంటలకు పైగా పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విమానంలోని ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో టర్కీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
కాగా, టర్కీలోని ఆ విమానాశ్రయం విమానాల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సాంకేతిక లోపం వల్ల ఆ విమానం అక్కడి నుంచి టేకాఫ్ కాలేకపోయింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి విమాన సిబ్బంది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ విమానంలోని ప్రయాణికులు ఖాళీగా ఉన్న చిన్న టెర్మినల్ బిల్డింగ్లో 16 గంటలకుపైగా వేచి ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ప్రయాణికుల్లో ఉన్నారు.
మరోవైపు ఆ విమానంలో 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులున్నారు. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన వారే. దీంతో ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఒక ప్రయాణికుడు తెలిపాడు. అలాగే భారతీయ ప్రయాణికులకు సహాయం కోసం ఒక నోడల్ అధికారిని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియమించినట్లు సమాచారం.