చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ల కోసం నిర్మించిన ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కాషాయ నేతల ఫోటోలకు చోటు కల్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ఏఐఏడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. జయలలిత చేసిన సేవలకు చిహ్నంగా ఆమె చేసిన త్యాగం చూపిన తెగువను ప్రపంచానికి ప్రదర్శించేలా ఈ అలయం నిర్మించామని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయ కుమార్ వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందించిందని ఆలయం లోపల ఏర్పాటు చేసిన బీజేపీ నేతల ఫోటోలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలో మధురైలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధురైకి చెందిన వారని చెప్పుకొచ్చారు. ఇక జయలలిత 2016 డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఎంజీఆర్ 1987 డిసెంబర్ 24న కన్నుమూశారు. తమిళనాడు రెవెన్యూ మంత్రి కుమార్ పర్యవేక్షణలో ఈ ఏడాది జనవరిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. తిరుమంగళం సమీపంలోని టీ కునుతూర్ ప్రాంతంలోని 12 ఎకరాల స్ధలంలో ఆలయాన్ని నిర్మించారు.