Raghuvanshi | షిల్లాంగ్, జూన్ 11: తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేసినట్లు సోనమ్ రఘువంశీ ఒప్పుకున్నట్లు మేఘాలయ పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడైన సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా సమక్షంలో ప్రశ్నించినపుడు తన భర్త హత్యకు జరిగిన కుట్రలో తన ప్రమేయం ఉన్నట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. రాజ్ కుష్వాహాతో కలసి సోనమ్ తీసుకున్న ఫొటో కూడా బయటపడింది.
మే 23 లేక 24న రాజాను హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. మే 25న నిందితులు ఇండోర్‌కు తిరిగి వచ్చారని చెప్పారు. తన భర్త హత్య తర్వాత సోనమ్ కూడా ఇండోర్ తిరిగి వచ్చినట్లు తెలిపారు. అద్దెకు తీసుకున్న గదిలో ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలుసుకుందని చెప్పారు. మే 23న మేఘాలయలోని వీ సాడాంగ్ జలపాతం వద్ద రఘువంశీ అదృశ్యం కాగా జూన్ 2న ఆయన మృతదేహం వాటర్ ఫాల్స్ సమీపంలోని లోయలో లభించింది. రాజా రఘువంశీ హత్య కుట్రలో పాలు పంచుకున్న సోనమ్, మరో నలుగురు నిందితులకు షిల్లాంగ్ కోర్టు 8 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
రాజా రఘువంశీ హత్యకు సోనమ్ కుట్ర పన్నినట్లు తాను వంద శాతం నమ్ముతున్నానని, నేరం రుజువైతే ఆమెను ఉరితీయాలని సోనమ్ సోదరుడు గోవింద్ బుధవారం ఇండోర్‌లో తెలిపారు. తన సోదరితో తమ కుటుంబం అన్ని బంధాలను తెంపుకుందని ఆయన చెప్పారు. హత్యకు గురైన రాజా కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన గోవింద్ న్యాయం కోసం వారు సాగించే పోరాటానికి తాను కూడా సాయపడతానని చెప్పారు. రాజా కుటుంబ సభ్యులను ఇండోర్‌లోని వారి ఇంటికి గోవింద్ వెళ్లారు.
హృదయ విదారకంగా రోదిస్తున్న రాజా తల్లి ఉమను గోవింద్ ఓదార్చారు. అనంతరం అక్కడే విలేకరులతో గోవింద్ మాట్లాడారు. తన సోదరి సోనమ్ నేరం చేసినట్లు రుజువైతే ఆమెను నేరుగా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టులో రాజా రఘువంశీ కుటుంబం తరఫున వాదించేందుకు తానే ఓ న్యాయవాదిని నియమిస్తానని ఆయన వెల్లడించారు. కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబానికి తాను క్షమాపణ చెప్పానని గోవింద్ చెప్పారు.